మాయాకూటమిని నమ్మకండి
కెసిఆర్ అభివృద్దికి పట్టం కట్టండి: కొప్పుల
ధర్మపురి,నవంబర్27(జనంసాక్షి): మాయమాటలతో జల్లోకి వస్తున్న మహా కూటమిని ప్రజలు నమ్మవద్దని ధర్మపురి టిఆర్‌ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతుందని ఈశ్వర్ పేర్కొన్నారు. గ్రామాలలో ఈశ్వర్ ఇంటింటా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా గ్రామాలలో జరిగిన గ్రామ సభల్లో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి
ఈశ్వర్ మాట్లాడుతూ, నాలుగు సంవత్సరాలలో రాష్ట్రం ఎంతో పురోగతి సాధించిందన్నారు. ముఖ్యంగా శాశ్వతంగా నీటి సమస్య పరిష్కారానికి కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టడం జరుగుతుందని తెలిపారు. త్వరలో ఆ ప్రాజెక్ట్ ద్వారా ఫలాలు అందనున్నాయని ఈశ్వర్ పేర్కొన్నారు. రాష్ట్రం అంతా సస్యశ్యామలం కాబోతుందన్నారు. కేసీఆర్ సీఎం అయితే రాష్ట్రం ఎంతో పురోగతి సాధిస్తుందన్నారు. 60 సంవత్సరాలు పాటు పాలించిన కాంగ్రెస్, టీడీపీ పార్టీలు తెలంగాణ ఎంతో గోస పెట్టాయనీ, ఈ తరుణంలో అవే రెండు పార్టీలు మహాకూటమిగా ఏర్పడి ఎన్నికల ప్రచారానికి వస్తున్నారనీ, వారిని ప్రజలు నమ్మవద్దని ఈశ్వర్ కోరారు. మళ్లీ తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానీ, అందుకు ప్రజలు ఆశీర్వదించాలని ఈశ్వర్ ప్రజలను కోరారు. దేశంలోనే సీఎం కేసీఆర్ నెంబర్ వన్‌గా నిలిపారన్నారు. దేశం అంతా తెలంగాణ వైపు చూస్తున్నారన్నారు. ఇక్కడ అమలు చేస్తున్న పథకాలను దేశంలో ఇతర రాష్ట్రాలలో అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు అమలు చేయడం వల్ల ప్రజలకు ఎంతో మేలు జరిగిందన్నారు. ఈ తరుణంలో ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు మళ్లీ కారు గుర్తుకు ఓటేసి గెలిపిస్తే అన్ని రంగాలలోఅభివృద్ధి జరుగుతుందని ఈశ్వర్ అన్నారు. అన్ని వర్గాల వారికి మేలు జరుగుతుందన్నారు.