మాయావతి సంతృప్తి చెందలేదు : స్వాతి సింగ్

లక్నో : వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తన భర్తపై కేసు నమోదు చేసినా, క్షమాపణ చెప్పినా కూడా బీఎస్పీ అధినేత్రి మాయావతి సంతృప్తి చెందలేదని యూపీ బీజేపీ మాజీ ఉపాధ్యక్షుడు దయాశంకర్ భార్య స్వాతి సింగ్ పేర్కొన్నారు. స్వాతి సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘బీఎస్పీ నేతలు నన్ను, నా కూతుర్ని మానసికంగా వేధిస్తున్నారు. 12 ఏళ్ల నా కూతురును రాజకీయాల్లోకి లాగొద్దు. మా కుటుంబాన్ని బయటకు ఈడ్చాలని బీఎస్పీ నేతలు బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు. ఇలాంటి వ్యాఖ్యలను మాయావతి ఎందుకు ఖండించడం లేదు? నా భర్త నాలుక కోసి తెస్తే రూ. 50 లక్షలు రివార్డు ఇస్తామని ఓ మహిళా నేత ప్రకటించారు. ఇది ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. నేను, నా కూతురు బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. నా కూతురు పాఠశాలకు కూడా వెళ్లడం లేదు. బీఎస్పీ నేతలు భయానక వాతావరణం సృష్టిస్తున్నారు. నాకు, నా కుమార్తెకు ఎలాంటి ప్రమాదం సంభవించినా మాయావతే బాధ్యత వహించాలి. నా కుటుంబంపై అసభ్య వ్యాఖ్యలు చేసిన బీఎస్పీ నేతలను మాయావతి సస్పెండ్ చేయాలి’ అని స్వాతి సింగ్ డిమాండ్ చేశారు.