మార్కెట్‌ భూములు వక్ఫ్‌ ఆస్తులే

3

అషావలీ రూపొందించిన గెజిట్‌ ప్రామాణికం

మున్సిపల్‌ దురాక్రమణను కట్టడి చేయండి

వక్ఫ్‌ ప్రాపర్టీ ప్రొటెక్షన్‌ సెల్‌ నేతలు

కరీంనగర్‌, మే 18 (జనంసాక్షి)- అదాలత్‌ మసీద్‌ భూములు వక్ఫ్‌ ఆస్తులు మాత్రమేనని ప్రభుత్వం మున్సిపల్‌ కార్పొరేషన్‌ దురాక్రమణ నుంచి వాటిని పరిక్షించాలని వక్ఫ్‌ ప్రాపర్టీ ప్రొటెక్షన్‌ సెల్‌ ఛైర్మన్‌ ఎండి అజమతుల్లా ఖాన్‌, అబ్దుల్‌ కుదుబ్‌ సయ్యద్‌, ఎండీ అలీ డిమాండ్‌ చేశారు. సోమవారం కరీంనగర్‌కు వక్ఫ్‌ ప్రాపర్టీ ప్రొటెక్షన్‌ సెల్‌ ఆధ్వర్యంలో కరీంనగర్‌ అదాలత్‌ మసీద్‌ ప్రాంతంను సందర్శించి భూముల యాజమాన్యంపై విచారణ జరిపింది. వక్ఫ్‌భూములుగా కరీంనగర్‌ తహసిల్‌దార్‌గా పనిచేసిన అషప్‌ అలీ 1960 దశకంలోనే అదాలత్‌ మసీదు ఇప్పటికి మున్సిపల్‌ కార్పొరేషన్‌ భవన ప్రాంతం, వాటర్‌ట్యాంక్‌, అర్బన్‌బ్యాంకు భూములను వక్ఫ్‌ గెజిట్‌లో రాశారని వాటి తాలుకు నఖళ్ళు తీసుకొచ్చి చూపారు. మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు ఏకపక్షంగా మార్కెట్‌ను ధ్వంసం చేస్తుంటే వక్ఫ్‌బోర్టు కూడా చేష్టలుడిగి చూసిందని కొంత మంది ముస్లిం పెద్దలు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం మున్సిపల్‌ కమీషనర్‌ కెవిరమణాచారీని కలిసి ఈ భూమి తమదని దానిపై ఏలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని వక్ఫ్‌ప్రాపర్టీ ప్రొటెక్షన్‌ సెల్‌ టీం వినతి పత్రం ఇచ్చారు. దీనితో కమీషనర్‌ ఏకీభవించ కుండా సుప్రీం కోర్టు మున్సిపల్‌ నియమావళికన్నా, వక్ఫ్‌ నియమావళి కన్నా పెద్దదని సుప్రీం కోర్టు చెప్పినట్లు నడుచుకుంటామని ఈ భూమిలో మార్కెట్‌ను అభివృద్ది చేసి పాతవారికి కూడా ఉపాధి పొందేందుకు అవకాశం ఇస్తామని చెప్పారు. 42 మందికి అవకాశం కల్పించేందుకు చర్యలు కూడా తీసుకున్నామని అన్నారు. మాజీ డిప్యూటీ మేయర్‌ అబ్బాస్‌షమీ తన వద్ద ఉన్న భూముల పత్రాలను చూపుతు ఆస్తుల యాజమాన్యం వక్ఫ్‌ బోర్డువని వాదించారు. వక్ఫ్‌బోర్డు ఛైర్మన్‌ మౌసీన్‌ మౌనం వహించటాన్ని ముస్లిం సమాజం తప్పుబట్టింది. అనంతరం జిల్లా ఇంచార్జీ కలెక్టర్‌ పౌసమి బసును వక్ఫ్‌ కమిటి కలిసింది. ఇంచార్జీ కలెక్టర్‌ పౌసమి బసు వక్ఫ్‌ పెద్దలు చెప్పిన అన్ని అంశాలు విని ప్రస్తుతం ఈ భూమిపై మీ వద్ద ఉన్న పత్రాలను బట్టి మీది కరెక్టు అని మీకు అనిపిస్తున్నది. అదే విధంగా మున్సిపల్‌ వద్ద వున్న రికార్డు ప్రకారం వారిది కరెక్టు అని వారికి అనిపిస్తున్నది. వివాదం  రావడంతో  ఇద్దరి వాదన విని సుప్రీం కోర్టు కూడా ఒకరిది అని చెప్పి మున్సిపల్‌కు హక్కు కట్టబెట్టింది. అంటే సుప్రీం కోర్టు ఏ తీర్పు ఇచ్చిందో దాని ప్రకారం వారు నడుచుకున్నారు. ఇందులో నేను ఏం చేయలేను అని చేతులు ఎత్తేశారు. అయితే అజమతుల్లా మాత్రం 30 ఏళ్ళు ఏ ఆస్తి ఎవరి ఆధీనంలోవుంటే వారే దాని హక్కుదారులు కదా మేం దానికి వక్ఫ్‌ రుసుము వసూలు చేశామని తెలిపారు. అంటే వారు కూడా తైబజార్‌ ఫీజు వసూలు చేశారని చూపుతున్నారని సుప్రీం తీర్పును ఎవరు మార్చలేరని  ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్‌ తీర్మాణించి చట్టసభల్లో బిల్లు పెడితే మాత్రమే ఈ తీర్పు మార్పు చేయడానికి వీలవుతోందని ఇంచార్జీ కలెక్టర్‌ వారికి చెప్పారు.  అనంతరం   ఇక నేతలు జిల్లా పోలీసు సూపరిటెండెంట్‌ శివకుమార్‌ను కూడా కలిసి తమకు భూమిపై హక్కు వుందని చెప్పుకున్నారు. గెజటిట్‌ ప్రకారం  సర్వేచేయాలని కోరారు.