మార్కెట్ విధానంలో మార్పులు రావాలి
రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వాలు ఎన్ని రకాలుగా కృషి చేస్తున్నా మార్కెట్లో మాత్రం దోపిడీని అడ్డుకోవడం లేదు. ఎన్ని సహాయాలో పొంది పంటలు పండించి మార్కెట్‌కు తీసుకుని వస్తున్న రైతు అక్కడ చిత్తవుతున్నాడు. మార్కెటింగ్ వ్యవస్థలో మార్పులు తీసుకుని రాకుంటే రైతుల సంక్షేమం మంటగలిసి పోగలదు. మార్కెట్లోకి వచ్చిన రైతులను రకరకాలుగా దోపిడీ చేస్తున్నారు. అధికరా పార్టీకి చెందిన మార్కెట్ కమిటీలే ఉన్నా వారు కూడా దళారులతో కుమ్మక్కు అవుతున్నారు. ఈ దుస్థితి పోయి రైతులు తమ పంటలను గిట్టుబాటు ధరలకు దర్జాగా అమ్ముకునే స్థితి రావాలి. అప్పుడే రైతాంగానికి మేలు జరగగలదు. రైతు సంక్షేమమే ధ్యేయమని కొలువుదీరిన మార్కెట్ పాలకవర్గాలు వారి కళ్లెదుటే రైతులు దగాకు గురవుతున్నా పట్టించుకోవటం లేదు. ప్రభుత్వం రైతుల మేలు కోసం చేసిన నిబంధనను కచ్చితంగా అమలు చేసేలా మార్కెటు అధికారులు, ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. మార్కెటింగ్ అధికారులు కూడా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. కవిూషన్ ఏజంట్లు దడవాయి ఛార్జీల ను రైతులతోనే కట్టించుకంటూ నిలువు దోపిడీ చేస్తున్నారు. యథేచ్ఛగా దడవాయి దోపిడీ జరుగు తుంటే రైతులు ఏటా కోట్లల్లో నష్టపోతున్నారు. వ్యవసాయ మార్కెట్‌కు రైతు తెచ్చిన ధాన్యాన్ని కవిూషన్ ఏజంటు ద్వారా వ్యాపారులు కోనుగోలు చేస్తుంటారు. టెండరు పద్ధతిలో ధాన్యం కొనుగోలు చేశాక బస్తా తూకం వేయటంకోసం దడవాయిలకు ఇచ్చే ఛార్జీలు కొనుగోలుదారులే చెల్లించేలా ఉత్తర్వులు ఉన్నాయి. వ్యవసాయ మార్కెట్లలో అధికారులు ఈ నిబంధనను పట్టించుకోవడం లేదు. ప్రతి బస్తా తూకం వేసినందుకు రైతుకు ఇచ్చే సొమ్ములో కోత విధించి దడవాయిలకు ఇస్తున్నారు. ఇదేమని అడిగిన రైతులకు అసలు తక్‌పట్టే ఇవ్వకుండా తెల్లకాగితం విూద రాసి చేతిలో పెట్టి పంపిస్తున్నారు. కోనుగోలుదారులతో ఉన్న సాన్నిహిత్యం తో పాలకవర్గాలు కూడా నోరుమొదపటం లేదు. అసలు రైతులకు ఈ నిబంధన ఉందన్న అవగాహన కూడా లేదు. అవగాహన కల్పించాల్సిన, నిబంధనను అమలు చేయాల్సిన అధికారులు బాధ్యతను విస్మరిస్తున్నారు. పాలకవర్గాలు కూడా పట్టించుకోకపోవటం శోచనీయం. కొనుగోలుదారులే దడవాయి ఛార్జీలు చెల్లించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినా అమలు కావడం లేదు. వాటిని అమలు చేయకుండా వ్యాపారవర్గాలకు కొమ్ముకాస్తున్నారు. ఫలితంగా రెక్కల కష్టమైన పంటను అమ్ముకునేందుకు వచ్చిన అన్నదాతలే దడవాయి ఛార్జీలు చెల్లించాల్సి వస్తోంది. సీజన్‌లో ఒక్కో మార్కెట్ యార్డుకు సీజన్‌లో వేలాది బస్తాల్లో వివిధ రకాల ధాన్యం ఉత్పత్తులు వస్తుంటాయి. వ్యాపారులే దడవాయి ఛార్జీలు చెల్లించాల న్న నిబంధన ఉన్నా దాన్ని అమలుచేయక పోవటంతో రైతులు నష్టపోతున్నారు. దడవాయి ఛార్జీలు వ్యాపారులే చెల్లించాలన్న నిబంధన ఉంది. అన్ని మార్కెట్లలో ఈ నిబంధన అమలు కావటం లేదు. ఇప్పటికీ రైతుల నుంచే దడవాయి ఛార్జీలను వసూలు చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వసూలు చేయటంపై రైతులు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని మార్కెటింగ్ అధికారులు చెప్పి తప్పించు కుంటున్నారు. రైతుల నుంచి దడవాయి ఛార్జీలు వసూలు చేయరాదని నిబంధన ఉన్నా కొనుగోలుదారులు, కవిూషన్ దారులు, అధికారులు కుమ్ముక్కై అమలు చేయటం లేదు. ఇకపోతే తరుగు పేరుతో మరికొందరు రైతులను దోచేస్తున్నారు. వ్యాపారులు పాత పద్ధతిలోనే తరుగు తీసుకుంటున్నారు. కిలో తరుగు వల్ల ఎకరానికి బస్తా తేడా వస్తుంది. అన్నదాత ఆరుగాలం కష్టించి పండించిన పంటను వ్యాపారులు కిలో తరుగుతో దోచేస్తున్నారు. ఈ పరిస్థితిలో మార్పు తేవాలని ఏటా సీజన్‌లో అధికారులకు, ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు ఇస్తున్నా మార్పులేదు. ఇలా ఏటా రెండు సీజన్‌లలో రైతులు సుమారు కోట్ల మేర దోపిడీకి
గురువుతున్నారు. ఇక్కడి వ్యాపారులు రెండు కిలోలు తూకం అదనంగా వేసుకుని అమ్ముతున్నారు. పట్టుపడినా కేసులు లేకుండా పైరవీలు చేసుకుని వ్యాపార దందా సాగిస్తున్నారు. ఇలా ఒక్కో రైతు సగటున ఎకరానికి రూ.750 నుంచి రూ.850 వరకు నష్టపోతున్నాడు. ప్రధాన పట్టణాలలో మిల్లులు ఉన్న చోట తరుగు విధానం లేదు. కేవలం కిలో తరుగుతోనే కాంటాలు జరుగుతున్నాయి. లైసెన్సు లేకుండా గ్రామాల్లో వ్యాపారులు ధాన్యం కొనుగోలు చేస్తూ రైతులను మోసం చేస్తున్నా అధికారులు పట్టనట్లు వ్యవహరి స్తున్నారు. సంచితో కాంటా వేస్తే.. బస్తా బరువు కింద అదనంగా కిలో తూకం వేయాలి. గతంలో కళ్లాలు చేసేటపుడు పట్టలు లేక నేలపై నూర్పిడి చేసేవారు. అపుడు కళ్లాలలో మట్టి, ఎగపోత సమయంలో గాలికి వెళ్లని చెత్త ఎక్కువగా ఉంటుందని కిలో అదనంగా తూకం వేసుకునే వారు. ఇపుడు అలాంటి పరిస్థితి లేదు. వరికోత యంత్రాలతో పనులు చేస్తున్నందున మట్టి, చెత్తా లేకుండా శుభ్రంగా వస్తున్నాయి. తరుగు తీయాల్సిన అవసరం లేదు. మార్కెట్లలో పారదర్శక విధానం రావాల్సిన అవసరం ఉంది. రైతులు నేరుఏగా తెచ్చుకున్న ధాన్యాం ఏ రోజుకారోజే అమముకోగలగాలి. అందుకు అనగుఉణంగా చర్యలు ఉండాలి. మద్దతు ధరలతో పాటు సాఫీగా అమ్మకాలు సాగితే రైతుకు అంతకు మించి అవసరం లేదు. ఈ వ్యవస్తపై ప్రభుత్వాలు దృష్టి పెట్టనంతవరకు ఎన్ని రకాల సాయాలు అందించినా ఫలితం ఉండదు.