మార్క్‌ఫెడ్‌ ద్వారా కందుల కొనుగోళ్లు

ఆదిలాబాద్‌,జనవరి23(జ‌నంసాక్షి): ప్రైవేట్‌ వ్యాపారులు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి కందులు, ఇతర సరుకును కొనుగోలు చేయొద్దని జెసి సంధ్యారాణి అన్నారు. మోసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. రైతులు మార్కెట్‌ యార్డులోనే విక్ర యించాలని చెప్పారు. ప్రభుత్వ మద్దతు ధరకు తక్కువకు రైతులు కందులను అమ్ముకొని మోసపోవద్దన్నారు. రైతులు పండించిన పంటలను మార్కెట్‌ యార్డుల్లోనే అమ్ముకొనేలా చూడాలని జిల్లా సంయుక్త కలెక్టర్‌ సూచించారు. మండలాల వారీగా ముందస్తుగా రైతులకు తేదీలను ఖరారు చేసి ఆ తేదీలోనే రైతులు వచ్చేటట్లు చూడాలన్నారు. రైతులందరికీ ఒకేసారి పంటచేతికి వస్తుందని, అందరూ తీసుకరావడంతో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందన్నారు. ఆదిలాబాద్‌ మార్కెట్‌ యార్డులో కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. మార్క్‌పెడ్‌ ఆధ్వర్యంలో కందుల కొనుగోళ్లను చేపడుతున్నామని చెప్పారు. క్వింటాల్‌ రూ. 5,675 ధర చెల్లించి కొనుగోళ్లు చేస్తున్నారని తెలిపారు. రైతులు తమ సరుకును ఎండబెట్టి మార్కెట్‌ యార్డుకు తీసుకరావాలన్నారు. కందుల్లో వ్యర్థ పదార్థాలు, తేమ మొత్తం 12శాతానికి మించి ఉండరాదన్నారు. మార్కెట్‌ యార్డులోనే కందుల కొనుగోళ్లు జరగాలన్నారు. నాణ్యమైన సరుకును తీసుకొచ్చి మంచి ధరను పొందాలని సూ చించారు. ప్రతి రోజూ కొనుగోలు కేంద్రాలను మార్కెటింగ్‌ అధికారులు పర్యవేక్షించాలన్నారు. ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా రైతులకు అన్ని వసతులు కల్పించాలని సూచించారు. మార్కెట్‌ యార్డులో రైతులకు ఏమైనా ఇబ్బందులుంటే అధికారులకు తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో మార్క్‌ ఇన్‌ డీఎం పుల్లయ్య, జిల్లా సహకార అధికారి మోహన్‌, మార్కెటింగ్‌ ఏడీ శ్రీనివాస్‌, మార్కెట్‌ కార్యదర్శి రాజేందర్‌, సూపర్‌ రాజేశ్వర్‌, శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.