మార్చి నాటికి ‘యాదాద్రి’లో విద్యుత్ ఉత్పత్తి
` ప్రాజెక్టు భూ నిర్వాసితులకు సత్వరమే పరిహారం చెల్లించాలి
` థర్మల్ పవర్ ప్లాంట్‌ను పరిశీలించిన డిప్యూటీ సీఎం భట్టి
మిర్యాలగూడ(జనంసాక్షి): నల్గొండ జిల్లా దామరచర్ల మండలం యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌ను తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలతో కలిసి పరిశీలించారు. అనంతరం పనుల పురోగతిపై అధికారులతో సవిూక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ… ప్రాజెక్టు కోసం భూమి కోల్పోయిన వారిని గౌరవించాలని, ప్రాజెక్టు పూర్తి అయ్యేలోపు అర్హులైన వారికి శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని అధికారులకు సూచించారు. భూ నిర్వాసితులకు పరిహారం సత్వరమే చెల్లించాలని అధికారులను ఆదేశించారు. 2025 మార్చి కల్లా యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో 4000ల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. ఇందుకు అవసరమైన శ్రామికులను పెద్దఎత్తున సమకూర్చుకోవాలన్నారు. ప్లాంట్ నుంచి దామరచర్ల వరకు బొగ్గు రవాణా ఇతర అవసరాలకు నాలుగు లేన్ల ప్రత్యేక రహదారి నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు.