మార్చ్‌కు పోలీసు అనుమతి అవసరం లేదు

నాయకులు తెలంగాణ వైపో కాదో తేల్చుకోవాలి
శాంతియుతంగానే మార్చ్‌ కొనసాగిస్తాం: కోదండరామ్‌
హైదరాబాద్‌,సెప్టెంబర్‌24: శాంతి కోసం, ప్రజాస్వామ్య అకాంక్షలను వ్యక్తపరచడానికి సెప్టెంబర్‌ 30న జరిగే తెలంగాణ మార్చ్‌కు పోలీసుల అనుమతి అవసరం లేదని టీజేఏసీ చైర్మన్‌ ప్రొ. కోదండరాం అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు తమ భావాలను వ్యక్తపరచాడానికి పోలీసుల అనుమతి అవసరం లేదని.. కేవలం సమావేశానికి బందోబస్తు కోసం మాత్రమే పోలీసులకు సమాచారం ఇస్తామని ఆయన తెలిపారు. ఈ మేరకు 30న జరిగే శాంతియుత ప్రదర్వన కోసం పోలీసులకు లేఖ ఇస్తామని అన్నారు. తెలంగాణ జెఎసి సమావేశానంతరం టిఎన్జీవో భవన్‌లో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ట్యాంక్‌బాండ్‌, నెక్లెస్‌ రోడ్డుపై జరిగే సాగరహారంనకు ప్రభుత్వం సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కవుల ఆట-పాట, చిత్రకారుల బొమ్మలు, వివిద కళారుపాల ప్రదర్శన ఉంటుందన్నారు.
తెలంగాణపై ప్రకటన చేయించేందుకు తెలంగాణ ప్రాంత మంత్రులకు జేఏసీ ఛైర్మన్‌ కోదండరాం సెప్టెంబర్‌ 30 డెడ్‌లైన్‌ అని హెచ్చరించారు. ఆయన టీఎన్‌జీవో భవన్‌లో జరిగిన తెలంగాణ మార్చ్‌ సన్నాహక సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ మార్చ్‌ జరపబోయే సెప్టెంబర్‌ 30లోపు తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ మంత్రులు తెలంగాణపై కేంద్ర ప్రభుత్వంచే స్పష్టమైన ప్రకటన చేయించాలని, లేదంటే వారు తమ మంత్రి పదవులకు రాజీనామా చేసి మార్చ్‌లో పాల్గొనాలని ఆయన డిమాండ్‌ చేశారు. అసలు తెలంగాణ మంత్రుల వల్లే మార్చ్‌ నిర్వహించాల్సిన దుస్థితి వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మార్చ్‌ ప్రశాంతంగా, శాంతియుతంగా కళాకారుల ఆటపాటలతో ట్యాంక్‌బండ్‌పై జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ మార్చ్‌కు ‘సాగర హారం’ అని నామకరణం చేశామని ఆయన వెల్లడించారు.తెలంగాణ ప్రాంత నాయకులు తమవైపు ఉంటారో ప్రభుత్వం వైపో తేల్చుకోవాలన్నారు. అలాగే ట్యాంకుబండ్‌, నెక్లెస్‌ రోడ్డుపైనే ‘తెలంగాణ మార్చ్‌’ను నిర్వహించనున్నట్టు కోదండరాం ప్రకటించారు. . కవాతును శాంతియుతంగా నిర్వహించాలని ఆయన కోరారు. మార్చ్‌లో కళాకారులు, గాయకులు వివిధ కళలలను ప్రదర్శించడానికి వేదికలను ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు. మార్చ్‌కు అనుమతి ఉందాలేదా అని అందరు అడుగుతున్నారని, కానీ పోలీసులకు మనం సమాచారం
మాత్రమే ఇస్తామని, మార్చ్‌కు సంబంధించి వారు శాంతిభద్రతల ఏర్పాట్లు చేసుకుంటారని కోదండరాం తెలిపారు. తెలంగాణ మార్చ్‌ను నిరాటంకంగా నిర్వహించేందుకు తెలంగాణ మంత్రులు పాటుపడాలని కోరారు. సెప్టెంబర్‌ 30లోపు తెలంగాణ ప్రకటన రాకుంటే మంత్రులు కూడా మార్చ్‌లో పాల్గొనాలని ఆయన డిమాండ్‌ చేశారు. అసలు తెలంగాణ మంత్రుల వైఫల్యమే మార్చ్‌ నిర్వహించే వరకు తెచ్చిందని, మంత్రులు తెలంగాణ ప్రజలతో ఉంటర, సీమాంధ్ర నేతలతో ఉంటరా తేల్చుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఇదే మంత్రులకు డెడ్‌లైన్‌ అని ఆయన హెచ్చరించారు. ఉద్యమాన్ని ప్రభుత్వం అణచివేయాలని చూస్తే అది మూర్ఖత్వమేనని ఆయన స్పష్టం చేశారు. ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తామని ఆయన హెచ్చరించారు సమ్మక్క-సారక్క జాతరకు వెళ్లినట్టు ముల్లే మూట కట్టుకొని మార్చ్‌కు తరలిరావాలని యావత్‌ తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు. మార్చ్‌ రోజు జరగబోయే పరిణామాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాల్సి ఉంటుందని, హైదరాబాద్‌ను దిగ్బంధించి తీరుతామని స్పష్టంచేశారు. అయితే ఇదంతా శాంతియుతంగానే ఉంటుందన్నారు. మార్చ్‌ను అడ్డుకోవాలని ముఖ్యమంత్రి చూస్తున్నారని, ఏ శక్తి అడ్డుకోబోదని చెప్పారు. ఒక దీపంతో మరో దీపాన్ని వెలిగించినట్లు.. ఒక ఉద్యమకారుడు మరో వందమందితో తెలంగాణ మార్చ్‌ను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్యాకేజీలకు, ప్రగల్భాలకు తెలంగాణ ప్రజలు లొంగబోరని అన్నారు. ఇన్నాళ్లు మాటలతో ఆకాంక్ష వినిపించిన ప్రజలు ఇక చేతల్లో చూపించాలని ఆయన ఉద్బోధించారు. మార్చ్‌తో చరిత్రను తిరగరాయాలని టీజేఏసీ నేత మల్లెపల్లి లక్ష్మయ్య పిలుపునిచ్చారు. సీమాంధ్ర నేతల కుట్రలను అడ్డుకుంటామన్నారు.తెలంగాణ ప్రకటించాలని, లేకపోతే కురుక్షేత్ర యుద్ధమేనని కేంద్రానికి టీజేఏసీ రాష్ట్ర కో కన్వీనర్‌ రసమయి బాలకిషన్‌ హెచ్చరించారు. మార్చ్‌ను సక్సెస్‌ చేసి, సత్తా చాటుదామని డాట్స్‌ జేఏసీ కన్వీనర్‌ డాక్టర్‌ నర్సయ్యగౌడ్‌ పిలుపునిచ్చారు. మార్చ్‌లో పాల్గొనేందుకు మహారాష్ట్ర నుంచి పిల్లాపాపలతో తరలివస్తామని ముంబై తెలంగాణ బహుజన ఫోరం ప్రకటించింది. తెలంగాణ ఆకాంక్షను ఆంక్షలతో అడ్డుకోలేరని అన్నారు. తెలంగాణ రాష్టాన్ని ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.