‘మార్చ్‌’ వాయిదా ముచ్చటే లేదు

చీమల దండై కదలాలి.. ట్యాంక్‌ బండ్‌ అంతా నిండాలి
చిత్తశుద్ధి ఉంటే పది రోజుల్లో తెలంగాణ ప్రకటించండి
కోదండరాం
తొర్రూరు/జనగామ టౌన్‌, సెప్టెంబర్‌ 22 (జనంసాక్షి) :
తెలంగాణ మార్చ్‌ను వాయిదా వేసే ముచ్చటే లేదని టీజేఏసీ కోదండరాం స్పష్టం చేశారు. శనివారం వరంగల్‌ జిల్లాలోని తొర్రూరు, జనగామలో ఆయన తెలంగాణ మార్చ్‌ ప్రచారంలో భాగంగా జరిగిన బహిరంగ సభల్లో పాల్గొని మాట్లాడారు. తొర్రూరులో తెలంగాణ అమరవీరుల స్థూపాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ ఈ నెల 30న నిర్వహించనున్న తెలంగాణ మార్చ్‌కు ప్రజలు చీమలదండై కదిలి రావాలని, ట్యాంకు బండు జనసంద్రాన్ని తలపించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వానికి తెలంగాణ ఏర్పాటుపై చిత్తశుద్ధి లేకనే ఇంతకాలం నాన్చుడు ధోరణిని అవలంబిస్తున్నదని, ఒకవేళ తెలంగాణ మార్చ్‌ జరుగకుండా ఉండాలంటే 10 రోజుల్లో ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు
చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, తెలంగాణ మంత్రులు మార్చ్‌ను వాయిదా వేసుకోవాలని సూచిస్తున్నారని, అలాగైతే కేంద్రంపై ఒత్తిడి పెంచి తెలంగాణ ఏర్పడేందుకు కృషి చేయాలని సవాల్‌ చేశారు. సకల జనుల సమ్మె సమయంలోనూ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతాయన్న వాళ్లు, సమ్మె ప్రశాంతంగా జరుగుతుంటే ఉద్యమం చల్లారి పోయిందని దుష్ప్రచారం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే వంద రోజుల విరామం తర్వాత ఉలుకు, పలుకు లేనందున తెలంగాణ మార్చ్‌కు పిలుపునిచ్చామని కోదండరాం వివరించారు. జనగామ పట్టణంలో స్థానిక జేఏసీ కన్వీనర్‌ కన్న పర్శరాములు అధ్యక్షతన జనసంద్రం సభ పేరిట జరిగిన సభలో కోదండరాం మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు కల్పించినా, సీమాంధ్రులు ఎన్ని కుతంత్రాలు చేసినా మార్చ్‌ ఆగదన్నారు. ఈ సభలో టీజేఏసీ జిల్లా అధ్యక్షుడు ప్రొపెసర్‌ పాపిరెడ్డి, తెలంగాణ ఇంజనీరింగ్‌ జేఏసీ అధ్యక్షుడు వెంకటేశం, జనగామ జేఏసీ గౌరవ సలహాదారుడు మాజీ ఎమ్మెల్యే సీ.హెచ్‌.రాజారెడ్డి, డాక్టర్‌ రాజమౌళి, టీఆర్‌ఎస్‌ జనగామ నియోజకవర్గ ఇన్‌చార్జి ముత్తిరెడ్డి, పెద్ద ఎత్తున విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.