మార్చ్‌ స్వల్ప ఘటనలకే రికవరీ అంటున్నారే..

1969 నుంచి తెలంగాణలో జరిగిన
విధ్వంసానికి ఏ మూల్యం చెల్లిస్తరు ?
సీమాంధ్ర సర్కారుకు కోదండరాం సూటి ప్రశ్న
అడవిని అన్నలు కాపాడారు.. పాలకులు దోచుకోవాలని చూస్తున్నారు..
అటవీ శాఖలో ఉన్న కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయాల్సిందేనని డిమాండ్‌
తెలంగాణ ఉద్యమ మార్గనిర్దేశకులు జయశంకర్‌, బాపూజీ
టీఎన్జీవోల అధ్యక్షుడు దేవీ ప్రసాద్‌
హైదరాబాద్‌, అక్టోబర్‌ 12 (జనంసాక్షి) : తెలంగాణ మార్చ్‌లో జరిగిన స్వల్ప ఘటనలకే తెలంగాణవాదుల నుంచి రికవరీ చేస్తామంటున్న సీమాంధ్ర ప్రభుత్వం, 1969 నుంచి తెలంగాణలో జరిగిన విధ్వంసానికి ఏ మూల్యం చెల్లిస్తారని కోదండరాం ప్రశ్నించారు. శుక్రవారం ఓయూ జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన కొండా లక్ష్మణ్‌ బాపూజీ సంస్మరణ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమానికి హాజరైన టీఎస్జీవోల అధ్యక్షుడు దేవీ ప్రసాద్‌ మాట్లాడుతూ 1969లోనే బాపూజీ మంత్రి పదవికి రాజీనామా చేసి, తెలంగాణ కోసం ఉద్యమించారని కొనియా డారు. తెలంగాణలో ప్రొఫెసర్‌ జయశంకర్‌, బాపూజీకి ఉన్న గౌరవం ఇంకా ఎవరికీ లేదన్నారు. వీరిద్దరు ఉద్యమానికి మార్గనిర్దేశకులన్నారు. వారి స్ఫూర్తితోనే ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఇక్కడ వేలాది మంది చనిపోతున్నారని, కేవలం తెలంగాణలోనే పాలకుల తీరుతో తండ్రులు కొడుకులకు తల కొరివి పెడుతున్నారని ఆవేవన చెందారు. అంతకు ముందు అటవీ శాఖ కాంట్రాక్టు ఉద్యోగుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అడవులను అన్నలే కాపాడారని, పాలకులు వాటిని నాశనం చేసి, పెట్టుబడిదారులకు అంటగట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే, ఉద్యమిస్తామన్నారు.