మార్పు కోసం ప్రజా ఉద్యమాలే శరణ్యం అన్నా హజారే

జలియన్‌వాలా బాగ్‌ నుంచి జనతంత్ర యాత్ర ఆరంభం

అమృతసర్‌, (జనంసాక్షి) : మార్పు కోసం ప్రజా ఉద్యమాలే శరణ్యమని అవినీతి వ్యతిరేక పోరాట యోధుడు అన్నా హజారే అన్నారు. ప్రజా ఉద్యమాలే దేశ స్థితిగతులను మార్చగలవని ఆయన పేర్కొన్నారు. దేశంలో అవినీతికి వ్యతిరే కంగా మార్పు జరగాలంటే ప్రజలంతా ఏకమై ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు. ఆది వారం ఆయన జనతంత్ర యాత్రను ప్రారం భించారు. తొలుత ఆయన స్వర్ణ దేవాలయాన్ని దుర్గా మందిరాన్ని సందర్శించి పూజలు చేశారు. జలియన్‌ వాలా బాగ్‌లో అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం ఆయన బయట ప్రజలనుద్ధేశించి ప్రసంగించారు. మరో ఐదు నెలలలో పెద్ద ఎత్తున ఢిల్లీలో రాంలీలా మైదానంలో ర్యాలీ నిర్వహిస్తామని అవినీతి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తామని చెప్పారు. ఈ ఉద్యమం అవినీతి ప్రభుత్వం దశను తిరగరాస్తుందన్నారు. కాంగ్రెస్‌ నేతృత్వంలోని అవినీతి యూపీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా మద్దతును కూడగట్టేందుకు జనతంత్ర యాత్ర పేరుతో ఉద్యమిస్తామని చెప్పారు. బలమైన జన లోక్‌పాల్‌ బిల్లు కోసం 25సూత్రాల ప్రణాళికను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తామన్నారు. అన్నా బృందంలో చీలికలు వచ్చిన తరువాత హజారే జనతంత్ర మోర్చాను ఏర్పాటు చేశారు. ఆయనతో విభేదించి అరవింద్‌ కెజ్రీవాల్‌ రాజకీయ పార్టీ పెట్టిన విషయం తెలిసిందే. జనతంత్ర యాత్ర తొలిదశలో భాగంగా పంజాబ్‌లో ఆయన ఎనిమిది బహిరంగ సభల్లో ప్రసంగిస్తారు.