మాల్దీవుల్లో జీఎంఆర్‌కు చుక్కెదురు – ఎయిర్‌పోర్టును స్వాధీనం చేసుకున్న ప్రభుత్వం

మాలే : మాల్దీవుల రాజధాని మాలేలోని ఇబ్రహీం నాసిర్‌ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆ దేశ ప్రభుత్వం గురువారం సాయంత్రం స్వాధీనం చేసుకుంది. విమానాశ్రయ పనులను మొదట జీఎంఆర్‌ దక్కించుకుంది. తర్వాత పనుల్లో జాప్యాన్ని నిరసిస్తూ ప్రభుత్వం పనులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీనిపై జీఎంఆర్‌ సింగపూర్‌ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. మొదట మాల్దీవుల ప్రభుత్వ నిర్ణయంపై స్టే విధించిన కోర్టు తర్వాతి విచారణలో ప్రభుత్వ నిర్ణయం సరైందేనని పేర్కొంది. ఆ వెంటనే స్పందించిన ప్రభుత్వం కాంట్రాక్టు సంస్థ నుంచి విమనాశ్రయాన్ని స్వాధీనం చేసుకుంది. భారత్‌లోని హైదరాబాద్‌కు చెందిన జీఎంఆర్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించి ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించింది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు పనులు విజయవంతంగా పూర్తి చేసి, వివిధ దేశాల్లో కాంట్రాక్టులు పొందింది. మాల్దీవుల ప్రభుత్వ నిర్ణయంతో ఆ సంస్థకు మొదటిసారిగా ఎదురుదెబ్బ తగిలింది.