.మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో డిజిపి పర్యటన
` ఛత్తీస్‌గడ్ నుంచి మావోయిస్టుల రాకపై ఆరా
చర్ల,డిసెంబరు 1(జనంసాక్షి): తెలంగాణ` ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని చర్ల మండలం చెన్నాపురంలో ఏర్పాటు చేసిన బేస్ క్యాంప్‌ను డీజీపీ మహేందర్ రెడ్డి బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. సరిహద్దులో మావోయిస్టు కార్యకలాపాలపై ఈ సందర్భంగా డీజీపీ చర్చించారు. గురువారం నుంచి మావోయిస్టులు పీఎల్‌జీఏ వారోత్సవాలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో మావోయిస్టు ఇలాకాలో డీజీపీ పర్యటన రహస్యంగా సాగింది. సరిహద్దుల్లో భద్రతా చర్యలను జిల్లా ఎస్పీ సునీల్ దత్ డీజీపీకి వివరించారు. డీజీపీ పర్యటన నేపథ్యంలో పెద్దమిడిసిలేరు నుంచి చెన్నాపురం వరకు పెద్ద ఎత్తున భద్రతా బలగాలు మోహరించాయి. కీకారణ్యమైన చెన్నాపురానికి డీజీపీ ప్రత్యేక హెలికాఫ్టర్‌లో అక్కడికి చేరుకున్నారు. ఆయన వెంట సీఆర్‌పీఎఫ్ ఉన్నతాధికారులు ఉన్నారు.