మా గోస ప‌ట్ట‌దా: మూత్రం తాగి నిర‌స‌న తెలిపిన రైతులు

పుర్రెల‌తో ప్ర‌ద‌ర్శ‌న చేశారు… ప్ర‌భుత్వం ప‌ట్టించుకోలేదు. ఎలుక‌లను తింటూ నిర‌స‌న తెలిపారు..అయినా దిగిరాలేదు… న‌గ్న‌ప్ర‌ద‌ర్శ‌నతో ఆందోళ‌న చేశారు… అయినా త‌మ గోస విన‌లేదు. ఇక చేసేది ఏమీ లేక చివ‌రికి త‌మవెంట ప్లాస్టిక్ బాటిల్స్‌లో తెచ్చుకున్న మూత్రం తాగి నిర‌స‌న వ్య‌క్తం చేశారు. ఇది చేసిందెవ‌రో కాదు.. గ‌త 38 రోజులుగా త‌మ బాధ వినాలంటూ దేశ రాజ‌ధాని ఢిల్లీలోని జంత‌ర్ మంత‌ర్ ద‌గ్గ‌ర ప‌లు విధాలుగా నిర‌స‌న తెలుపుతున్న త‌మిళ రైతులు. ఈ రోజు ప‌ట్టెడ‌న్నం క‌డుపులోకి పోతుందంటే అందుకు కార‌ణం రైతులు. మ‌రి అలాంటి రైతుల‌కే ఇంత క‌ష్ట‌మొచ్చిన్ప‌ప్పుడు ప్ర‌భుత్వం ఆదుకునేందుకు ముందుకు రాక‌పోవ‌డం ప‌లువురిని ఆలోచింప జేస్తోంది. ఇంత‌కంటే దౌర్భాగ్యం ఇంకేమైనా ఉంటుందా అంటూ సోష‌ల్ యాక్టివిస్టులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. నెటిజన్లు ప్రభుత్వం పై దుమ్మెత్తి పోస్తున్నారు.

దేశంలో ఏదో మూల‌న నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నారంటే అది పాల‌కుల దృష్టికి రాక‌పోవ‌చ్చు..కానీ త‌మ‌ళి రైత‌న్న‌లు దేశ‌రాజ‌ధాని ఢిల్లీ న‌డిబొడ్డున త‌మ రుణాల‌ను మాఫీ చేయాల‌ని, క‌రువు మండ‌లాల‌ను ఆదుకోవాల‌ని నెల‌రోజుల‌కు పైగా నిర‌స‌న‌లు వ్య‌క్తం చేస్తున్న కేంద్ర స‌ర్కార్‌కు క‌నువిప్పు క‌ల‌గ‌డం లేదు. క‌నీసం అక్క‌డ ఏమి జ‌రుగుతుందో కూడా తెలుసుకోవాల‌నే ప్ర‌య‌త్నం చేయ‌లేదు మోడీ స‌ర్కార్.

ఓట్ల స‌మ‌యంలో రైత‌న్నకు అది చేస్తాం …ఇది చేస్తాం… రుణాలు మాఫీ చేస్తాం అని చెప్పుకు తిరిగే నేత‌లు… ఆ త‌ర్వాత రైతు క‌న్నీళ్లు పెడుతున్నా, ఆక‌లితో అల‌మ‌టిస్తున్నా పట్టించుకున్న పాపాన పోలేదు.ఇక త‌మిళ‌నాడు రైతుల దుస్థితి మ‌రీ దారుణంగా ఉంది. కుర్చీ కీచులాట‌లో ప‌డి త‌మిళ ప్ర‌భుత్వం ఢిల్లీ పెద్ద‌ల‌తో ఆ రాష్ట్ర రైతుల దుస్థితిపై చ‌ర్చిద్దామ‌న్న ఇంకిత జ్ఞానం కూడా లేకుండా వ్య‌వ‌హ‌రిస్తోంది. త‌మిళ రైతుల‌కు మ‌ద్ద‌తుగా త‌మిళ సినీ ఇండ‌స్ట్రీ క‌దిలి వ‌చ్చి వారి ప‌రిస్థితిని కేంద్ర‌మంత్రి అరుణ్ జైట్లీ వ‌ద్ద‌కు తీసుకొచ్చిన ఫ‌లితం లేదు. ఒక్క అడుగు ముందుకు కూడా ప‌డ‌లేదు.

ఇక రోజుకో ప‌ద్ద‌తిలో నిర‌స‌న తెలుపుతున్న రైత‌న్న‌లు శ‌నివారం మూత్రం తాగుతూ వినూత్న ప‌ద్ధ‌తిలో త‌మ నిర‌స‌న‌ను వ్య‌క్తం చేశారు. ఇది చూసైనా మోడీ స‌ర్కార్‌లో క‌ద‌లిక వ‌స్తుందో రాదో వేచి చూడాలి.