మా ప్రభుత్వ హయాంలో ఒక్క కుంభకోణం కూడా జరగలేదు
– ప్రధాని నరేంద్ర మోదీ
కోల్ కతా మే 4 (జనంసాక్షి): తమ ప్రభుత్వ హయాంలో ఒక్క కుంభకోణం కూడా జరగలేదని మోదీ గుర్తు చేశారు.ఆదివారం నాడు బరన్‌పూర్‌లో పర్యటించిన ఆయన అక్కడ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ప్రసంగించారు. బంగ్లాదేశ్‌తో చిరకాలంగా ఉన్న సరిహద్దు సమస్యను పరిష్కరించుకున్నామని మోదీ తెలిపారు. బొగ్గు గనులు కేటాయించిన ప్రతి జిల్లాలో ఒక సంస్థను ఏర్పాటు చేస్తామని, బొగ్గు గనులు వేలం ద్వారా వచ్చిన ఆదాయంలో కొంతమేర స్థానికుల కోసం వినియోగిస్తామని ప్రధాని హావిూ ఇచ్చారు.
టీమిండియా స్ఫూర్తితో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అభివృద్ధి రాజకీయ విభేదాలు ఆటంకం కాకూడదని ఆయన అభిప్రాయపడ్డారు.
కాళికామాత ఆలయాన్ని దర్శించుకున్న మోదీ
కోల్‌కతలోని దక్షిణేశ్వర్ కాళికామాత ఆలయాన్ని ఆదివారం ఉదయం ప్రధాని నరేంద్ర మోదీ దర్శించుకున్నారు. అనంతరం మఠం పెద్ద విజ్ఞప్తి మేరకు బేలూరు మఠానికి చేరుకుని సందర్శించారు. రామకృష్ణ పరమహంస ఆత్మజ్ఞానం పొందిన ఆలయంలో కొద్దిసేపు గడిపారు.
విూ ఇంట్లో పిల్లాడినే.. స్వాగతం ఎందుకు?
ఓ ఇంటికి చెందిన వ్యక్తి తన ఇంటికే వస్తే ఎవరైనా స్వాగతం పలుకుతారా అని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. తాను విూ ఇంట్లో పిల్లాడినేనని, విూ అందరిలో ఒకడినని ఆయన బేలూరులోని రామకృష్ణ మఠానికి చెందిన సన్యాసులతో అన్నారు. పశ్చిమ బెంగాల్ పర్యటనలో ఉన్న ఆయన తన గురువుగారు స్వావిూ ఆత్మస్థానందను కలిసేందుకు ఆయన చికిత్స పొందుతున్న కోల్ కతాలోని మఠానికి చెందిన ఆస్పత్రికి వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న ఏర్పాట్లు, ఘనస్వాగతాన్ని ఉద్దేశించి అలా అన్నారు. ‘విూరంతా మా గురువుగారికి సేవ చేస్తున్నారు. ఆయనను జాగ్రత్తగా చూసుకొండి’ అంటూ ఆయన వారికి సూచించారు.