మా ఫోన్లు ట్యాప్‌ అవుతున్నాయి

విూడియా సమావేశంలో పాడి గగ్గోలు
కరీంనగర్‌,సెప్టెంబర్‌5 ( జనం సాక్షి ) :  తన ఫోన్‌ను రాష్ట్ర ప్రభుత్వం ట్యాప్‌ చేస్తోందని భారాస హుజూరాబాద్‌ బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఆరోపించారు. ప్రతి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ ఫోన్లను ట్యాప్‌ చేస్తున్నారన్నారు. కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటలో నిర్వహించిన విూడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మా వ్యక్తిగత సమాచారం ఎలా తెలుస్తోంది. కరీంనగర్‌ సీపీ ఫోన్‌ కూడా ట్యాప్‌ చేస్తున్నారు. మానకొండూరు సీఐకి కాన్ఫరెన్స్‌ పెట్టడం లేదని మంత్రి, ఎమ్మెల్యేకు ఎలా తెలుసు? ప్రజలకు రక్షణ కల్పించే పోలీసుల ఫోన్లను ట్యాప్‌ చేయడం సిగ్గుచేటు. రుణమాఫీ కాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేవలం 40 శాతం మందికే రుణాలు మాఫీ అయ్యాయి. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ చెక్కులైనా పంపిణీ చేసేందుకు ఎమ్మెల్యేకు హక్కు ఉంటుంది. ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు కాంగ్రెస్‌ పార్టీవి కావు.. అవి ప్రజల సొమ్ము. ఎన్నికల్లో ఓటమిపాలైన అభ్యర్థి చెక్కులు పంచుతున్నారు. దీనిపై హైకోర్టుకు వెళ్తా. సీపీ ఫోన్‌ ట్యాపింగ్‌కు గురైనపుడు కేంద్రమంత్రి బండి సంజయ్‌ ఎందుకు స్పందించడం లేదు. దీనిపై సీబీఐ విచారణ జరిపించాలి‘ అని కౌశిక్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.