మా భద్రత కోసమే రఫేల్..
– ఎవర్నీ భయపట్టే ఉద్దేశం కాదు
– కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్
ఫ్రాన్స్, అక్టోబర్9 (జనం సాక్షి): రఫెల్ యుద్ధ విమానం తీసుకుంది ఎవర్నీ భయపెట్టే ఉద్దేశంతో కాదని, భారత్ దేశ భద్రత కోసమే అని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. రెండు రోజుల ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లిన కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అక్కడ డసోల్ ఏవియేషన్ సంస్థ నుంచి తొలి రఫేల్ యుద్ధ విమానాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రఫేల్ యుద్ధ విమానానికి ఆయుధపూజను నిర్వహించిన అనంతరం అందులో ప్రయాణించారు. రఫేల్‌లో దాదాపు 25 నిమిషాల పాటు ప్రయాణించిన రాజ్‌నాథ్.. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. అత్యాధునిక ఆయుధాలు సమకూర్చుకొని ఏ దేశాన్నీ భయపెట్టే ఉద్దేశం భారత్‌కు లేదన్నారు. కేవలం తమ రక్షణ సామర్థ్యాన్ని పెంపొందించుకోవడమే లక్ష్యమని రాజ్‌నాథ్ స్పష్టం చేశారు. రఫేల్‌లో విహరించడం ఎంతో సౌకర్యంగా, హాయిగా ఉందని .. జీవితంలో ఇలాంటి క్షణాలు ఒక్కసారే వస్తాయని సంతోషం వ్యక్తం చేశారు. ఓ యుద్ధ విమానంలో కూర్చుని సూపర్‌సోనిక్ వేగంతో ప్రయాణిస్తానని తాను కలలో కూడా ఊహించలేదని తన అనుభూతిని పంచుకున్నారు. రఫేల్ రాకతో వైమానిక దళం మరింత శక్తివంతమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఫిబ్రవరి 2021 నాటికి మరో 18 రఫేల్ యుద్ధ విమానాలు భారత్‌కు అందనున్నాయని ఆయన తెలిపారు. మే 2022 నాటికి మొత్తం 36 యుద్ధ విమానాలు భారత్‌కు ఫ్రాన్స్ అప్పగించనుంది. రఫేల్ ఘనత ప్రధాని నరేంద్ర మోదీకి దక్కాల్సిన అవసరం ఉందని, ఆయన సాహసోపేతమైన నిర్ణయాలు దేశ భద్రతకు లబ్ది చేకూరుస్తున్నాయని రాజ్‌నాథ్ వ్యాఖ్యానించారు. భారత వైమానిక దళం 87వ వార్షికోత్సవం జరుపుకున్న వేళ రఫేల్ యుద్ధ విమానాన్ని ఫ్రాన్స్ అందజేయడం విశేషం. ఆర్బీ 001 నెంబరు గల రఫేల్ జెట్‌ను డసోల్ట్ ఏవియేషన్ సంస్థ హెడ్ పైలట్ ఫిలిప్పీ డ్యుచెట్యూతో కలిసి ప్రయాణించారు. ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద వైమానిక దళమైన భారత్ వాయుసేనలో బహుళ సామర్థ్యం కలిగిన రఫేల్ చేరికతో మరింత బలోపేతమవుతుందని, గగనతలంలో భద్రత, శాంతికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ఫ్రెంచ్ భాషలో రఫేల్ అంటే వాయువేగం.. ఈ యుద్ధ విమానం తన పేరును సార్థకత చేసుకుంటుందని రాజ్‌నాథ్ పేర్కొన్నారు.