మా స్పిన్నర్లు నిరాశపరిచారు ముంబై ఓటమిపై ధోని
ముంబై ,నవంబర్ 26:
రెండో టెస్టులో అనూహ్య ఓటమితో షాక్ తిన్న ధోనీ మ్యాచ్ అనంతంరం తీవ్ర నిరాశలో కనిపించాడు. తనకు స్పిన్ పిచ్ మాత్రమే కావాలంటూ పట్టుబట్టి మరీ వ్యూహం పన్నిన భారత సారథి చివరికి అది బెడిసి కొట్టడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు. తాను పన్నిన ఉచ్చులో తామే చిక్కుకోవడంతో కొంచెం ఇబ్బందిగా మాట్లాడాడు. అయితే తమ స్పిన్నర్లు పూర్తిగా నిరాశపరిచారని వారిపై ఓటమి భారాన్ని వేసే ప్రయత్నం చేశాడు. ఇదే పిచ్‌పై ఇంగ్లాండ్ స్పిన్నర్ పనేసర్ అద్భుతంగా బౌలింగ్ చేశాడని ప్రశంసించాడు. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్‌పై తమ బౌలర్లు ప్రభావం చూపలేకపోయారన్నాడు. అటు ఇంగ్లాండ్ టీమ్ ప్రణాళికలు చక్కగా పనిచేశాయని కితాబిచ్చాడు. అయితే రాబోయే రెండు టెస్టులు భారత జట్టుకు పరీక్ష లాంటివని చెప్పాడు. ప్రపంచ క్రికెట్‌లో రెండు అత్యుత్తమ జట్లు పోటీపడుతున్నాయని , సిరీస్ ఫలితం ఆసక్తికరంగా మారిందని వ్యాఖ్యానించాడు. అహ్మాదాబాద్ పిచ్‌తో పోలిస్తే.. ముంబై పూర్తి స్పిన్‌కు అనుకూలించదన్నాడు. అయితే ముంబై ఓటమి మాత్రం ధోనీకి కనువిప్పు కలిగించలేదు. కోల్‌కత్తాలో జరిగే మూడో టెస్టుకు కూడా ఇటువంటి పిచ్ కావాలని కోరుతున్నాడు.టెస్ట్ క్రికెట్‌లో ఇటువంటి సవాళ్లు ఎదుర్కొంటేనే ఫలితాలు వస్తాయని వ్యాఖ్యానించాడు.
ఇదిలా ఉంటే టాస్ ఓడిపోవడం కాస్త నిరాశ కలిగించినా… తమ ప్లాన్ చక్కగా అమలు చేశామని ఇంగ్లాండ్ కెప్టెన్ అలెస్టర్ కుక్ అన్నాడు. ఇదొక గొప్ప విజయమని , దీనిలో ఎలాంటి సందేహం లేదన్నాడు. తమ స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారన్నాడు. ముఖ్యంగా పనేసర్ భారత బ్యాటింగ్‌ను దెబ్బతీయడంలో కీలకపాత్ర పోషించడంపై ప్రశంసల జల్లు కురిపించాడు. మిగిలిన రెండు టెస్టుల్లోనూ ఇదే జోరు కొనసాగించి భారత్‌ను నిలువరిస్తామని ధీమా వ్యక్తం చేశాడు. అటు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికైన పీటర్సన్ జట్టు విజయంపై ఆనందం వ్యక్తం చేశాడు. సెంచరీతో ఫామ్‌లోకి రావడం , సిరీస్ సమం చేయడంలో తన పాత్ర కూడా ఉండడం సంతోషంగా ఉందన్నాడు.