మిజోరం స్పీకర్‌ హైపీ కాంగ్రెస్‌కు రాజీనామా

త్వరలోనే బిజెపిలో చేరేందుకు రంగం సిద్దం

ఐజ్వాల్‌,నవంబర్‌5(జ‌నంసాక్షి): మిజోరంలో కాంగ్రెస్‌ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్‌ నేత, అసెంబ్లీ స్పీకర్‌ హైపీ తన పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. అతను బిజెపిలో చేరనున్నట్లు ప్రకటించారు. ఎన్నికల వేళ మైపీ రాజీనామా కాంగ్రెస్‌ పార్టీకి గట్టి ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. ఈ మేరకు హైపీ తన రాజీనామా పత్రాన్ని సోమవారం డిప్యూటీ స్పీకర్‌ ఆర్‌ లాల్‌రినామాకు సమర్పించారు. హైపీ రాజీనామాను డిప్యూటీ స్పీకర్‌ ఆమోదించారు. అంతేగాక కాంగ్రెస్‌ పార్టీని కూడా వీడుతున్నట్లు ఈ సందర్భంగా హైపీ తెలిపారు. త్వరలోనే తాను భారతీయ జనతా పార్టీలో చేరనున్నట్లు వెల్లడించారు. మరికొద్ది రోజుల్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో హైపీ పార్టీని వీడటంతో కాంగ్రెస్‌కు షాక్‌ తగిలినట్లయింది. ఈశాన్య రాష్టాల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం మిజోరం. అక్కడ నవంబరు 28న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కాగా.. హైపీ భాజపాలో చేరుతారని గత కొంతకాలంగా ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఇటీవలే ఆయన కేంద్రంలోని భాజపా నేతలతోనూ సమావేశమయ్యారు. ఈ ఊహాగానాలకు చెక్‌ పెడుతూ తాను స్పీకర్‌ పదవికి, కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు హైపీ ప్రకటించారు.