మిజోరాం బరిలో 211మంది

 

రెండుచోట్ల పోటీ చేస్తున్న సిఎం లాల్‌ తన్హావ్లా

ఐజ్వాల్‌,నవంబర్‌10(జ‌నంసాక్షి): మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 211 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. చిన్న రాష్ట్రమైనా ఇక్కడ పోటీలో అనేకులు ముందుకు వచ్చారని తెలుస్తోంది. మొత్తం 211మంది బరిలో నిలిచినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్‌ గడువు శుక్రవారంతో ముగిసింది. రాష్ట్రంలోని 40 నియోజకవర్గాలకు గానూ 211 మంది అభ్యర్థులు నామినేషన్‌ వేసినట్లు తెలిపాaరు. అధికార కాంగ్రెస్‌ పార్టీ, ప్రతిపక్ష మిజో నేషనల్‌ ఫ్రంట్‌(ఎంఎన్‌ఎఫ్‌), భారతీయ జనతా పార్టీ(భాజపా) మొత్తం 40 నియోజకవర్గాల్లో అభ్యర్థులను దింపాయి. ఇక జోరమ్‌ పీపుల్స్‌ మూవ్‌మెంట్‌(జడ్‌పీఎం) పార్టీ 35 స్థానాల్లో , నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ(ఎన్‌పీపీ) 9 , నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ(ఎన్సీపీ) 5చోట్ల బరిలోకి దిగుతున్నాయి. ముఖ్యమంత్రి లాల్‌ థన్హావ్లా రెండు చోట్ల నుంచి పోటీ చేస్తున్నారు. సెర్చిప్‌, చాంపాయ్‌ సౌత్‌ నుంచి సీఎం నామినేషన్‌ దాఖలు చేశారు. మిజోరంలో మొత్తం 40 శాసనసభ నియోజకవర్గాలున్నాయి. వీటికి నవంబరు 28న ఎన్నికలు నిర్వహించనున్నారు. డిసెంబరు 11న ఫలితాలు వెలువడుతాయి.