మిఠాయి రంగుల్లో  కెమికల్స్‌ 

జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక
న్యూఢిల్లీ,అక్టోబర్‌16(జ‌నంసాక్షి): దసరా, దీపావళి పండగల సందర్భంగా మిఠాయిలు పంచుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఇందుకోసం మనం పలు రకాల మిఠాయిలు కొనుగోలు చేయాల్సి వస్తుంది. అలాగే వాటి రుచులనూ చూడాల్సి వస్తుంది. అయితే మిఠాయిలు కొనేముందు, తినేముందు కొన్ని జాగ్రత్తలు
తీసుకోవడం అత్యవసరం అని ఆహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. . లేనిపక్షంలో అనారోగ్యం పాలయ్యే అవకాశాలుంటాయి. ముఖ్యంగా రకరకాల రంగుల్లో తీర్చిద్దే మిఠాయిలకు దూరంగా ఉండాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. కెమికల్స్‌తో కూడిన ఈ రంగులను వినియోగించడం వలన మిఠాయిలు విషతుల్యమవుతాయని వారు చెబుతున్నారు. వీటిని తినడం వలన ఊపిరితిత్తులకు, కాలేయానికి హాని కలుగుతుందని హెచ్చరిస్తున్నారు. మిఠాయిని చేతుల్లోకి తీసుకున్నప్పుడు దాని రంగు చేతులకు అంటుకుంటే అది కల్తీ అయిందని గుర్తించి, దానిని తినకండి. మిఠాయిలలో వినియోగించే కోవా ఎంతో మెత్తగా ఉంటుంది. అయితే అది పలుకుల మాదిరిగా చేతులకు అంటుకుంటే కల్తీ జరిగిందని అర్థం చేసుకోండి. ఇటువంటి మిఠాయిలకు దూరంగా ఉండటం ఉత్తమమని గ్రహించండి.