మిశ్రాపై క్రిమినల్‌, పరవునష్టం కేసులు

న్యూఢిల్లీ,మే 19(జనంసాక్షి): మాజీ మంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ బహిష్కృత నేత కపిల్‌ మిశ్రాపై దిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్‌ క్రిమినల్‌ పరువు నష్టం దావా వేశారు. మిశ్రాతో పాటు భాజపా-ఎస్‌ఏడీ ఎమ్మెల్యే మన్‌జిందర్‌ ఎస్‌ సిశ్రాపై దిల్లీలోని తీన్‌ హజారీ కోర్టులో జైన్‌ పరువు నష్టం పిటిషన్‌ను దాఖలు చేశారు. ‘దిల్లీ ముఖ్యమంత్రి, ఆప్‌ కన్వీనర్‌ అరవింద్‌ కేజీవ్రాల్‌కు ఆరోగ్యశాఖ మంత్రి జైన్‌ రూ.2కోట్లు ముడుపులు ఇచ్చారు. అందుకు నేనే ప్రత్యక్ష సాక్షిని. కేజీవ్రాల్‌ బంధువుల కోసం రూ.50కోట్ల విలువైన భూదందాలను పరిష్కరించినట్లు జైన్‌ నాతో చెప్పారు’ అంటూ మిశ్రా సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. మిశ్రా వ్యాఖ్యలతో తన పరువుకు తీవ్ర నష్టం వాటిల్లిందంటూ జైన్‌ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తనపై నిరాధారంగా అవినీతి ఆరోపణలు చేస్తున్నారంటూ పిటిషన్‌లో పేర్కొన్నారు. జైన్‌ ఇచ్చిన డబ్బులకు సంబంధించిన లెక్కలు చెప్పాల్సిందిగా మిశ్రా డిమాండ్‌ చేశారు. కేజీవ్రాల్‌ అవినీతిపరుడంటూ సీబీఐ అధికారులకు ఫిర్యాదు చేశారు. సీఎంతో పాటు మరో ఐదుగురు ఆప్‌ నేతల విదేశీ పర్యటన వివరాలు వెల్లడించాల్సిందిగా మిశ్రా నిరాహారదీక్ష చేపట్టారు. అనారోగ్యం కారణంగా దీక్ష విరమించిన ఆయన డొల్ల కంపెనీల ద్వారా ఆప్‌కు విరాళాలు వస్తున్నాయని, ఇద్దరు ఆప్‌ కార్యకర్తల పేర్లతో కంపెనీలు ఏర్పాటు చేసి వాటి ద్వారా నల్లధనాన్ని తెల్లధనంగా మారుస్తున్నారంటూ పలు ఆరోపణలు చేశారు.