మిషన్ కాకతీయతో మారనున్న ఆయకట్టు
చెరువుల పునరుద్దరణతో సానుకూల పరిస్థితి
ఆదిలాబాద్,ఫిబ్రవరి18(జనంసాక్షి): వెనుకబడిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రధాన జీవనాధారం వ్యవసాయమే. సాగు నీటి వసతి మాత్రం అంతంతే. వట్టివాగు, చెలిమెల, పాల్వాయిసాగర్ లాంటి మధ్యతరహా జలాశయాలు ఉన్నప్పటికీ కాల్వల దుస్థితి కారణంగా పదిశాతం ఆయకట్టుకు కూడా నీరందించలేని పరిస్థితి ఉంది.రాబోయే ఐదేళ్ల కాలంలో అక్కరకు రాని స్థితిలో ఉన్న చెరువులన్నింటిని మిషన్ కాకతీయ పథకం కింద పునరుద్ధరించే చర్యల్ని ప్రభుత్వం చేపట్టింది. ఇందులో పూడికతీత పనులు, కాల్వల మరమ్మతులు, తూములు, మత్తడి నిర్మాణం చేపడతారు. మట్టికట్టను బలోపేతం చేస్తారు. దీంతో ఏళ్లకాలం నుంచి నిరుపయోగంగా ఉన్న చెరువులు, కుంటల్లో నిండుగా నీరు చేరి కాల్వల ద్వారా ఆయకట్టుకు సాగునీరు అందుతుంది.రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్‌కాకతీయ పథకం పుణ్యమా అని చెరువులకు మహర్దశ వస్తోంది. ఇప్పటికే మూడు విడతలుగా జిల్లాలో పలు చెరువులు, కుంటలను పునరుద్ధరించగా ఇప్పుడవి జలసిరితో కళకళలాడుతున్నాయి. తాజాగా నాలుగో విడతకు శ్రీకారం చుట్టిన నేపథ్యంలో మిషన్ కాకతీయ పనులతో మరిన్ని చెరువులు పునరుద్దరణకు నోచుకోబోతున్నాయి. జిల్లాలో లెక్కకు మించి చెరువులు, కుంటలు ఉన్నప్పటికీ వీటి సగం కూడా ఆయకట్టుకు నీరందించడం లేదు. ఆయకట్టుకు నీరివ్వని స్థితిలో ఉన్న పాత చెరువులనేకం దశాబ్దాలుగా నిరుపయోగంగా ఉన్నాయి. జిల్లాలో ఉన్న చెరువులు, కుంటల్ని విభజించి.. చెరువుల పనులు పూర్తయినట్లు అధికారిక లెక్కలు వివరిస్తున్నాయి. కుమురం భీం జలాశయం ప్రధాన పనులు పూర్తయినా కాల్వలు పూర్తికాలేదు. జగన్నాథ్‌పూర్ జలాశయం పరిస్థితి కూడా ఇలాగే ఉంది. జలాశయాలు ఉన్నా ఆయకట్టు భూముల్లో వర్షాధార పంటలే వేసుకోవాల్సిన దయనీయ స్థితి. మిషన్ కాకతీయ పుణ్యమా అని వీటి పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. మిషన్ కాకతీయ నాలుగో విడత కింద జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోని పాత చెరువులకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు అధికారులు వెల్లడించారు.చెరువు మరమ్మతులు పక్కాగా చేసి ఆయకట్టుకు నీరందిస్తే నాలుగు దశాబ్దాల రైతుల కల నెరవేరుతుందని ఆయకట్టు దారులు అభిప్రాయపడుతున్నారు.