మిషన్ భగీరథ భేష్
– పనులను పరిశీలించిన గవర్నర్ నరసింహన్
మెదక్,జనవరి20(జనంసాక్షి): మెదక్ జిల్లాలో మిషన్ భగీరథ అమలవుతున్న తీరును గవర్నర్ నరసింహన్ పరిశీలించారు. అధికారులు వెంటరాగా ఇక్కడ నిర్మాణ పనులను పరిశీలించి వివరాలుఅ డిగి తెలుసుకున్నారు. గజ్వేల్ మండలం కోమటిబండ అటవీ ప్రాంతంలో గుట్టపై నిర్మిస్తున్న ఓవర్‌హెడ్ ట్యాంకు, వాటర్ గ్రిడ్ పథకం పనులను రాష్ట్ర గవర్నర్ నరసింహన్ బుధవారం మధ్యాహ్నం పరిశీలించారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ఈ పథకాన్ని రెండు మూడేళ్లలో పూర్తి చేసేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారంటూ ప్రశంసించారు. ఈ పథకం పూర్తయితే అందరికీ సురక్షితమైన నీరు అందుతుందన్నారు. వచ్చే మూడేళ్లో రాష్ట్రమంతటా సంపూర్ణంగా తాగు నీరు అందుతుందన్నారు. ఈ పథకం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా భగీరథ మ్యాప్‌ను వాటి పనితీరును జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్, ఆర్ డబ్ల్యూఎస్ ఎస్‌ఈ విజయ్‌ప్రకాష్ అడిగి తెలుసుకున్నారు. నీటి రాక తదితర వివరాలును వారు గవర్నర్‌కు వివరించారు. ఎక్కడి నుంచి ఎక్కడికి పైపుల ద్వారా నీరు వెళ్లేది తెలియచేశారు. మెదక్, వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లో పర్యటించిన గవర్నర్.. పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ముందుగా మెదక్ జిల్లా కోమటిబండలో పర్యటించిన గవర్నర్ .. స్థానిక గుట్టపై నిర్మిస్తున్న భారీ నీటి సంపు పనులను పరిశీలించారు. పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఎప్పటిలోగా పనులు పూర్తి చేస్తారని అధికారులను అడిగారు. రాష్ట్ర ప్రజలందరికీ తాగునీరు అందించాలన్న సీఎం కేసీఆర్ మహా సంకల్పంపై గవర్నర్ నరసింహన్ ప్రశంసలు గుప్పించారు. మిషన్ భగీరథ పనులు శరవేగంగా జరగడంపై గవర్నర్ సంతోషం వ్యక్తం చేశారు. త్వరలోనే ప్రతి ఒక్కరికీ సురక్షిత మంచినీరు అందుతుందన్నారు. మిషన్ భగీరథపై సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ పెట్టారని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ఈ పథకానికి అత్యంత ప్రాధ్యాన్యత నిస్తుందన్నారు. ప్రజలు, ప్రభుత్వం కలిస్తేనే ఏ పథకమైనా విజయవంతమౌతుందన్నారు. మిషన్ భగీరథ పనులు బుల్లెట్ స్పీడ్ తో జరుగుతున్నాయన్నారు. 90 శాతం పైప్ లైన్లు గ్రావిటీ ద్వారానే వేస్తున్నారని తెలిపారు. ఆ తరువాత గవర్నర్ నరసింహన్ వరంగల్ జిల్లా కొమురవెల్లి క్రాస్ రోడ్ దగ్గర మిషన్ భగీరథ పనులను పరిశీలించారు. అటు నుంచి మెదక్ జిల్లా కొండపాక వెళ్లారు. మిషన్ భగీరథ పనులను పరిశీలించిన అనంతరం.. కొండపాక గ్రామస్తులతో ముచ్చటించారు. ఆ తర్వాత చివరగా గవర్నర్ నరసింహన్ రంగారెడ్డి జిల్లా మేడ్చల్ టీటీడీ దేవస్థానంతో పాటు డబిర్ పుర, మునీరాబాద్ లో జరుగుతున్న మిషన్ భగీరథ పనులను పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. అధికారులు గవర్నర్ కు పనుల పురోగతి వివరాలను వివరించారు. ఈ పర్యటనలో గవర్నర్ నరసింహన్ తో పాటు మంత్రి మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.