మిస్సైన డేటాను సవరిస్తాం

1AAAA copy

– జేఈఈ ర్యాంకులపై ఆందోళన వద్దు

– ఉపముఖ్యమంత్రి కడియం

హైదారబాద్‌,జులై2(జనంసాక్షి):

జేఈఈ ర్యాంకుల గల్లంతుపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి భరోసా ఇచ్చారు. రాష్ట్రానికి చెందిన 1,188 మంది విద్యార్థుల మిస్సయిన డేటాను సీబీఎస్‌ఈకి అందించామని ఆయన చెప్పారు. విషయం తమ దృష్టికి రాగానే అధికారులను ఢిల్లీకి పంపించి పొరపాటుని సవరించామన్నారు. మిస్సయిన విద్యార్థుల మార్కులు వివరాలు అందించడంపై సీబీఎస్‌ఈ సానుకూలంగా స్పందించిందన్నారు. విద్యార్థుల ర్యాంకులను 4వ తేదీ ఉదయం సీబీఎస్‌ఈ ప్రకటిస్తుందని, జులై 5 వ తేదీ వరకు ఆప్షన్లను నమోదు చేసుకునే అవకాశం ఉందని డిప్యూటీ సీఎం వివరించారు. జులై 7 న సీట్ల కేటాయింపు ఉంటుందన్నారు. ఏ రకమైన ఇబ్బందులు లేకుండా విద్యార్థులకు సీట్ల కేటాయింపు ఉంటుందని కడియం శ్రీహరి చెప్పారు.

తెలంగాణ విద్యార్థులకు వారి అర్హతను బట్టి మొదటిసారే సీట్లు వస్తాయని ఉప ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేశారు. అర్హత సాధించగల ఏ ఒక్క విద్యార్థి కూడా సీటు కోల్పోవద్దనే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. విద్యార్థులకు నష్టం జరగకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. సీట్ల కేటాయింపు జరిగే వరకు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఢిల్లీలోనే ఉంటారని ఉప ముఖ్యమంత్రి చెప్పారు.

తెలంగాణ ఇంటర్మీడియట్‌ బోర్డు ద్వారా పొరపాటు జరిగిందని, దానికి కారణమైన అధికారులపై చర్యలు తీసుకుంటామని కడియం శ్రీహరి ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వ కృషితో తెలంగాణతో మరో నాలుగైదు రాష్ట్రాలకు కూడా లబ్ధి చేకూరిందని చెప్పారు.