మీకండగా నేనున్నా ధైర్యంగా ఉండండి
అమెరికా ప్రజలకు ఒబామా హితవు
న్యూయార్క్, నవంబర్ 1 (జనంసాక్షి) : సంక్షోభంలో విూ వెంట నేనున్నానంటూ అమెరికా అధ్యక్షుడు వారికి ధైర్యాన్ని ఇచ్చారు. వారి కష్టాల్లో పాలుపంచుకునేందుకు ఆయన నేరుగా బాధిత ప్రాంతాల్లో పర్యటనకు బయల్దేరారు. శాండీ పెనుతుఫానుతో తలెత్తిన సంక్షోభం యావజ్జాతికి గుండె పగిలేలా ఉందని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆవేదన వ్యక్తం చేశారు. కష్టాల్లో ఉన్నప్రజలకు ఆయన హావిూ ఇచ్చారు. సహాయక చర్యల్లో పాల్గొంటున్న సిబ్బందిని అభినందించారు. తుఫాను ముప్పు ఇంకా తొలగిపోలేదని
ఆయన హెచ్చరించారు. వాషింగ్టన్‌లోని అమెరికన్ రెడ్‌క్రాస్ ప్రధాన కార్యాలయానికి ఆయన వెళ్లారు. అక్కడే సహాయ, పునరావాస కార్యక్రమాలను సవిూక్షించారు. దేశవాసులకు గడిచిన 24 గంటల్లో అసాధారణ కష్టాలు ఎదురయ్యాయన్నారు. న్యూయార్క్ నగరవాసులు.. ముఖ్యంగా న్యూయార్క్ ఆస్పత్రి సిబ్బంది అక్కడి శిశువులను సురక్షితంగా బయటకు తెచ్చారని.. అగ్నిమాపక దళ సిబ్బంది ప్రజల ప్రాణాలను కాపాడేందుకు సాహసోపేతంగా పోరాడారని.. వారి స్ఫూర్తి, సాహసం అపారమని ప్రశంసించారు. ఆప్తులను కోల్పోయిన కుటుంబాలకు అమెరికా మొత్తం అండగా ఉంటుందని తెలిపారు. కాగా, ఒబామా స్వయంగా న్యూజెర్సీకి వెళ్లి అక్కడి పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలిస్తారని వైట్‌హౌస్ ప్రతినిధి తెలిపారు. శాండీ’ తుఫాను తన ప్రభావంలోనే కాదు.. సామాజిక వెబ్‌సైట్ ఫేస్‌బుక్‌లోనూ దుమారం లేపుతోంది. ఈ సంవత్సరం ఫేస్‌బుక్‌లో అత్యంత ఎక్కువగా చర్చించిన అంశాల్లో ‘శాండీ’ తుఫాను అంశం రెండో స్థానంలో నిలిచింది. ఇక అత్యంత ఎక్కువ మంది అమెరికన్లు షేర్ చేసిన పదం ‘వి ఆర్ ఓకే (మేం బాగానే ఉన్నాం)’. తాము సురక్షితం గానే ఉన్నామని స్నేహితులకు, బంధువులకు తెలియజెప్పడానికే ఫేస్‌బుక్‌లో పోస్టులు చేస్తున్నారు. వరదనీరు ముంచెత్తడం, విద్యుత్ సరఫరా లేకపోవడంతో లక్షలాది మంది తమ ఇళ్లను ఖాళీ చేయాల్సి వచ్చింది. అలాంటి ప్రాంతాల్లో పోలీసులతో పాటు ప్రైవేటు సెక్యూరిటీ గార్డులు తమ విధులను అప్రమత్తంగా నిర్వహిస్తున్నారు. మన్‌హట్టన్‌లోని చెల్సియా ప్రాంతంలో గల కొన్ని ప్రముఖ గ్యాలరీలు ప్రైవేటు- సెక్యూరిటీ-ని పెట్టు-కున్నాయి. బ్యాంకులు, భవనాల వద్ద పోలీసులు డేగకళ్లతో పహారా కాస్తున్నారు. క్వీన్స్ ప్రాంతంలో వంద ఇళ్లు అగ్నిప్రమాదంలో కాలిబూడిదయ్యాయి. దుకాణాలు, మందుల షాపులు, బ్యాంకును దోచుకోడానికి ప్రయత్నించిన 12 మందిని కోనీ ఐలండ్, క్వీన్స్ ప్రాంతాల్లో పోలీసులు అరెస్టుచేశారు. మేరీలాండ్‌లోని క్రిస్‌ఫీల్డ్ ప్రాంతంలో గల ఓ శ్మశాన వాటికలో ఎక్కడో భూమిలోపల పాతిపెట్టిన శవపేటికలు ఇలా పైకి లేచి వచ్చాయి. పైనున్న మట్టి మొత్తం కొట్టుకోవడంతో ఒక వెండి, మరో ఇత్తడి శవపేటికలు బయటకు కనిపించాయి. వాటిపైన ఉన్న సిమెంటు శ్లాబ్‌లు లేచిపోయి, మట్టి కూడా కొట్టుకుపోవడంతో ఇవి ఇలా వచ్చాయి. అట్లాంటిక్ తీరంపై ప్రకృతిమాత కన్నెర్రకు ఇది నిదర్శనం.
న్యూయార్క్ నగరంలో రవాణాకు అత్యంత ప్రధానమైన సబ్‌వే (సొరంగ మార్గాలు) వ్యవస్థ పూర్తిగా నీటిలో మునిగి ఉండిపోయింది. దాదాపు వెయ్యి కిలోవిూటర్ల సబ్‌వే మార్గంలో ఉన్న 468 స్టేషన్లు, సిగ్నళ్లు, స్విచ్‌లు చాలా వరకు దెబ్బతిన్నట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ సబ్‌వేల్లో నిలిచిన నీటిని తోడేయడానికి నాలుగైదు రోజులకు పైగానే పట్టవచ్చని న్యూయార్క్ మేయర్ మైఖేల్ బ్లూమ్‌బర్గ్ చెప్పారు. మొత్తంగా సబ్‌వే వ్యవస్థ పనిచేయడానికి కనీసం ఏడు నుంచి పది రోజుల వరకు పట్టవచ్చని పేర్కొన్నారు. మరోవైపు.. విద్యుత్ సరఫరా నిలిచిపోవడం, చెట్లు కూలిపోవడం తదితర కారణాల వల్ల ఇతర రైల్వే మార్గాలు కూడా పనిచేసే స్థితిలో లేవు.