మీ రాజకీయాల కోసం ర్యాంకర్లను బలిచేయొద్దు
` మా పిల్లలు కష్టపడి చదివారు
` వారిని చులకన చేసి మాట్లాడడంసరికాదు
` గ్రూప్`1 ర్యాంకర్ల తల్లిదండ్రుల ఆవేదన
హైదరాబాద్(జనంసాక్షి):పిల్లల భవిష్యత్తుతో రాజకీయాలు వద్దని గ్రూప్-1 ర్యాంకర్ల తల్లిదండ్రులు కోరారు. తమ పిల్లలు కష్టపడి చదివి ర్యాంకులు సాధిస్తే కోట్లు పెట్టి కొన్నారని అభాండాలు వేస్తున్నారని వాపోయారు. రూ.3 కోట్లు- ఇచ్చి ఉద్యోగాలు కొనుక్కున్నారని కొందరు ఆరోపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంత డబ్బే ఉంటే తమ పిల్లఉ ఉద్యోగాలు కొనుక్కోవాల్సిన ఖర్మ లేదన్నారు. ఇటీవలి హైకోర్టు తీర్పు, వస్తున్న ఆరోపణల నేపథ్యంలో గ్రూప్-1 ర్యాంకర్లు, వారి తల్లిదండ్రులు కొందరు సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విూడియా సమావేశం నిర్వహించారు. ఈనెల 9న గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. గ్రూప్-1 పరీక్షల నిర్వహణ, మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయని వాటిని రద్దు చేయాలని కోరుతూ కొందరు, వాటిని రద్దు చేయరాదంటూ మరికొందరు దాఖలు చేసిన 12 పిటిషన్‌లపై విచారించిన హైకోర్టు.. 222 పేజీల తీర్పును వెలువరించింది. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు విూడియా సమావేశం నిర్వహించారు.అసత్య ఆరోపణలతో మనోవేదనకు గురిచేస్తున్నారని పలువురు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు.గ్రూప్-1 పరీక్షల వివాదాన్ని రాజకీయం చేయొద్దని,. కొందరు నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఆరోపణలు చేసేవారు వాటిని నిరూపించాలన్నారు. అప్పులు చేసి, ఓ పూట తిని.. మరో పూట తినక రెక్కలు ముక్కలయ్యేలా మా పిల్లలను కష్టపడి చదివించాం. ఎన్నో త్యాగాలు చేసి చదివిస్తే రూ.3 కోట్లు- ఇచ్చి ఉద్యోగాలు కొనుక్కున్నట్లు నిందలు వేస్తున్నారు. మాకు అంత స్థోమత లేదు. విూ రాజకీయాల కోసం మా పిల్లల భవిష్యత్తును నాశనం చేయొద్దని వేడుకున్నారు. అంతటి స్థోమతే ఉంటే ఈ ఉద్యోగాల కోసం వెంపర్లాడమని అన్నారు. పోస్టులు కొన్నామన్న ప్రచారంతో మా పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. అవమానాలకు గురవుతున్నారని,పోస్టులు కొనుక్కున్నామన్న ఆరోపణలపై ఎలాంటి విచారణకైనా మేం సిద్ధం అన్నారు. నిందలు వేసి మమ్మల్ని మనోవేదనకు గురిచేయొద్దు. అన్ని పార్టీల నేతలు సహకరించి మా బాధలు అర్థం చేసుకోవాలి. లేనిపోని దుష్పచ్రారాలు వ్యాప్తి చేయకుండా వాస్తవాలను తెలియ పరచాలని కోరారు. మా పిల్లలు ఎంతో కష్టపడి గ్రూప్-1 ర్యాంక్ సాధించారు. హైకోర్టు మాకు న్యాయం చేయాలని తల్లిదండ్రులు కోరారు. భర్త చనిపోతే ఓ పాఠశాలలో రూ.10వేల జీతానికి పనిచేస్తున్నా. రూ.30వేలు ఎప్పుడూ కళ్లతో చూడలేదు. రూ.3 కోట్లకు ఉద్యోగం కొన్నట్లు- నిరూపిస్తే నా మరణ శాసనం నేనే రాసుకుంటా. మా అబ్బాయికి అలాంటి ఉద్యోగం కూడా వద్దని 366వ ర్యాంకర్ తల్లి కన్నీటి పర్యంతమవుతూ చెప్పింది. ఎంతో కృషి పట్టుదలతో ర్యాంక్ సాధిస్తే.. కొంతమంది స్వార్థపరులు గ్రూప్-1ను రాజకీయం చేస్తున్నారు. ఓపిక, సహనంతో ఉన్నాం.. ఇప్పుడు చాలా బాధగా ఉంది. రూ.3కోట్లు- కాదు.. రూ.30లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ కూడా చూడలేదు. రాత్రీపగలు తేడా లేకుండా కూలి పనులు చేసుకుని చదివించాం. ఆధారాలతో ఆరోపణలు చేయండని 67వ ర్యాంకర్ తల్లి లలిత ఆవేదన చెందారు. రాజకీయ నాయకులు అసత్య ఆరోపణలు చేస్తున్నారు. ఎన్నో త్యాగాలు చేసి చదివిస్తే రూ.3 కోట్లకు ఉద్యోగాలు కొన్నామని నిందలు వేస్తున్నారు. ఫలితాలు వచ్చాక కొత్తగా ఈ రాజకీయం చేస్తున్నారు. నిందలు వేసి మమ్మల్ని మనోవేదనకు గురిచేయొద్దని, 46వ ర్యాంకర్ తండ్రి ఆవేదన చెదారు. ఉద్యోగం అమ్మింది ఎవరు? కొన్నది ఎవరో ఆధారాలు చూపించాలి. నా కుమారుడికి గతంలో ఎస్సై ఉద్యోగం వస్తే గ్రూప్-1 కోసం చదివాడు. ఇప్పుడు ఇలా నిరాధార ఆరోపణలు చేయడమేంటని 60వ ర్యాంకర్ మహేశ్ తండ్రి వాపోయాడు. ఇలా ఒక్కొక్కరు ఒక్కో తీరుగా తమ ఆవేదనను వ్యక్తం చేశారు.