ముంచుకొస్తున్న లానినో ప్రమాదం!

అయితే అతి వృష్టి. లేదంటే అనావృష్టి. గత కొంతకాలంగా జరుగుతోంది ఇదే. ముఖ్యంగా భారత్ లో పరిస్థితి భయంకరంగా ఉంది. ప్రకృతి ఏమాత్రం సహకరించట్లేదు. కరువు కోరల్లో దేశం అల్లాడుతోంది. గతేడాది ముంచుకొచ్చిన ఎల్‌నినోతో భారత్ లో ఇప్పటికీ ఎక్కడ చూసినా కరువు విలయతాండవం చేస్తోంది. గుక్కెడు నీటికి కూడా అలమటించాల్సిన పరిస్థితి. ఇక పంటనష్టం అయితే అంచనాలకు కూడా అందట్లేదు. ఈ ఎల్‌నినో దెబ్బకు ఇండియాతో పాటు యావత్ ఆసియా ఖండానికి కష్టాలొచ్చాయి. అత్యంత శక్తివంతమైన ఈ ఎల్‌నినో తో వ్యవసాయం దారుణగా దెబ్బతిన్నది. ప్రపంచంలోనే అత్యధికంగా వరిని ఎగుమతి చేసే దేశాల్లో ఒకటైన వియత్నాంలో కరువు కల్లోలం సృష్టించింది. అటు రికార్డుస్థాయి ఉష్ణోగ్రతలతో సూర్యుడు భగభగ మండిపోతున్నాడు. వేడిగాలులతో ఆసియా మొత్తంలోనూ లక్షల మందికి జీవనోపాధికి ముప్పు ఏర్పడింది. ఎల్‌నినో ప్రపంచవ్యాప్తంగా ఆరు కోట్లమందిని అత్యవసర సహాయం అవసరమయ్యే స్థితికి చేర్చింది. ఈ కష్టాల నుంచి గట్టెక్కముందే లానినో రూపంలో పెద్ద కష్టం ముంచుకొస్తోంది.లానినో కూడా ఎల్‌నినో లాగే అత్యంత శక్తివంతమైందంటున్నారు నిపుణులు. లానినో ఆసియాలో విధ్వంసం సృష్టించే ప్రమాదముందట. పరిస్థితి మరింత దిగజారిపోవచ్చన్న వాదన వినిపిస్తోంది. లానినో దెబ్బకు ఆసియాలో భారీ వర్షాలు ముంచెత్తే అవకాశముంది. వరదలు, కొండచరియలు విరిగే పడడం వల్ల పెద్ద కష్టమే రానుందంటున్నారు. వ్యవసాయం దారుణంగా దెబ్బతినొచ్చని హెచ్చరిస్తున్నారు. క్రిమి, కీటకాల బారిన పడి పంట దిగుబడి పూర్తిగా పడిపోవచ్చంటున్నారు. ఇవన్నీ ఆహార ఉత్పత్తిపై ప్రభావం చూపొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో భారత్ కూ ఇది ప్రమాద ఘంటికనేనంటున్నారు. లానినోతో దేశవ్యాప్తంగా భారీ వర్షాలు ముంచెత్తనున్నాయని నిపుణుల అంచనా. అయితే ఈ బీభత్సం సంగతి పక్కన బెడితే… భారీ వర్షాలతో నీటి కష్టాలకు ఉపశమనం మాత్రం దొరకనుందన్న వాదన వినిపిస్తోంది. ఇది ఎంతో కొంత వ్యవసాయానికి లాభం చేకూర్చవచ్చని అంచనా వేస్తున్నారు.