ముందస్తు విచారణ చేయలేం


– అయోధ్య కేసుపై సుప్రింకోర్టు స్పష్టీకరణ
న్యూఢిల్లీ, నవంబర్‌12(జ‌నంసాక్షి) : అయోధ్య కేసుపై ముందస్తు విచారణ చేయలేమని సుప్రింకోర్టు స్పష్టం చేసింది. రామ జన్మభూమి-బాబ్రీ మసీదు భూవివాదం కేసులో ముందస్తు విచారణ చేపట్టాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు మరోసారి కొట్టివేసింది. ఈ కేసును జనవరిలో విచారిస్తామని ఇప్పటికే తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఎలాంటి ముందస్తు విచారణ చేయబోమని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ మేరకు అఖిల భారత హిందూ మహాసభ వేసిన పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. ఈ కేసులో మేం ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామని, ఈ కేసులో దాఖలైన అప్పీళ్లన్నీ జనవరిలో ధర్మాసనం ముందుకు రానున్నాయని, అందువల్ల ముందస్తు విచారణ చేపట్టలేం అని చీఫ్‌ జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూవివాదంపై జనవరిలో విచారణ చేపడుతామని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. చాలా కాలంగా అయోధ్య అంశం పెండింగ్‌లో ఉన్నందున త్వరగా విచారణ చేపట్టాలని.. ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా, రామ్‌లల్లా విరాజ్‌మాన్‌ పక్షం తరఫున సీనియర్‌ న్యాయవాది వైద్యనాథన్‌ సుప్రీంకోర్టును అభ్యర్థించారు. దీనిపై గత నెలలో విచారణ చేపట్టిన న్యాయస్థానం.. న్యాయస్థానం తక్షణ విచారణ చేపట్టేందుకు నిరాకరించింది. తమ ప్రాథమ్యాలు తమకు ఉన్నందుకు తక్షణ విచారణ చేపట్టడం కుదరదని కోర్టు స్ఫష్టం చేసింది. వచ్చే జనవరి మొదటి వారంలో ఈ అంశాన్ని ‘సముచిత’ ధర్మాసనం పరిశీలించి, విచారణ తేదీలపై నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించింది. 2010లో అలహాబాద్‌ హైకోర్టు అయోధ్యలోని 2.77 ఎకరాల వివాదాస్పద భూమిని కక్షిదారులైన సున్నీ వక్ఫ్‌బోర్డు, నిర్మోహి అఖాడా, రామ్‌లల్లా పక్షాలు సమానంగా తలో భాగం పంచుకోవాలని తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. దీన్ని సవాలు చేస్తూ 14 అప్పీళ్లు దాఖలయ్యాయి.