ముందు తీవ్రవాదానికి కళ్లెంవెయ్యి

3

తరువాత నీతులు చెబుదువుగాని

నవాజ్‌ షరీఫ్‌ డిమాండుకు భారత్‌ ఘాటు సమాధానం

ఐక్యరాజ్యసమితి: కశ్మీర్‌ను నిస్సైనికీకరించాలన్న పాకిస్థాన్‌ ప్రధానమంత్రి నవాజ్‌ షరీఫ్‌ డిమాండును భారత్‌ నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. దానికి బదులుగా సొంతగడ్డపై తీవ్రవాద మూకలకు పాకిస్థాన్‌ కళ్లెం వేయాలని హితవు పలికింది. కశ్మీర్‌లో శాంతికోసం షరీఫ్‌ లేవనెత్తిన నాలుగు అంశాల్లో నిస్సైనికీకరణ ఒకటి. ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలో ప్రసంగిస్తూ షరీఫ్‌ కశ్మీర్‌ అంశాన్ని లేవనెత్తారు. కశ్మీర్‌ సమస్యను పరిష్కరించలేకపోవడం ఐక్యరాజ్యసమితి వైఫల్యంగానూ ఆయన చిత్రీకరించారు. దీనిపై భారత విదేశాంగ శాఖ ప్రతినిధి వికాస్‌ స్వరూప్‌ దీటుగా స్పందించారు. ”నిస్సైనికీకరణ దీనికి సమాధానం కాదు. పాకిస్థాన్‌ గడ్డపై నుంచి చెలరేగిపోయే తీవ్రవాదులకు అడ్డుకట్ట వేయడం ముఖ్యం. పాకిస్థాన్‌లో తీవ్రవాదానికి ఆ దేశం అనుసరిస్తున్న విధానాలే కారణం. నిజానికి పాకిస్థానే తీవ్రవాదాన్ని ఎగదోస్తోంది” అని ఆయన మండిపడ్డారు. ”తీవ్రవాదుల్ని పెంచిపోషించడమే పాకిస్థాన్‌లో అస్థిరతకు కారణం. ఇతరుల్ని నిందించడం దీనికి పరిష్కారం కాదు” అని ఆయన వ్యాఖ్యానించారు. పాలస్తీనీయులు, కశ్మీరీలు విదేశీ ఆక్రమణలో ఉన్నారన్న షరీఫ్‌ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తూ… తొలుత పాక్‌ ఆక్రమితి కశ్మీర్‌(పీఓకే)ను ఖాళీచేయాలని సూచించారు.

తీవ్రవాదాన్ని ఒక చట్టబద్ధ సాధనంగా పాకిస్థాన్‌ వాడుకుంటోందని ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత మిషన్‌ తొలి కార్యదర్శి అభిషేక్‌ సింగ్‌ ధ్వజమెత్తారు. తీవ్రవాదుల విషయంలో పాకిస్థాన్‌ అనుసరిస్తున్న విధానాల వల్ల చివరికి ఆ దేశమే బలవుతోందని ఆయన వ్యాఖ్యానించారు. సర్వప్రతినిధి సభ సాధారణ చర్చలో పాల్గొన్న సింగ్‌- భారత్‌కున్న సమాధాన హక్కును వినియోగించుకుని పాకిస్థాన్‌పై ఎదురుదాడి చేశారు.