ముందు రాఫెల్‌పై సమాధానం ఇవ్వండి

 

పక్కదారి పట్టించే సమాధానాలు కాదు: శశిధర్‌ రెడ్డి

మెదక్‌,అక్టోబర్‌1 (జ‌నంసాక్షి): కేంద్రంలో ని బీజేపీ ప్రభుత్వం భారతీయ సైన్యం, శౌర్య పరాక్రమాలపై చిల్లర రాజకీయాలు చేస్తోందని టీపీసీసీ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే పి.శశిధర్‌ రెడ్డి ఆరోపించారు. ‘పరాక్రమ్‌ పర్వ్‌’పేరుతో ప్రజల దృష్టిని కుంభకోణాలు, పాలన వైఫల్యాల నుంచి మళ్లించేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. రాఫెల్‌ కుంభకోణంపై కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ సంధించిన ప్రశ్నలకు ముందు సమాధానం చెప్పాలన్నారు. రాఫెల్‌ విషయంలో దాటవేత ధోరణిని ప్రజలు గమనిస్తున్నారని గుర్తుంచుకోవాలన్నారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ నేతృత్వంలో 1971లో భారత సైన్యం పాకిస్తాన్‌ను ఓడించిందని, 95 వేల మంది పాకిస్తాన్‌ సైనికులు భారతీయ సైన్యం ముందు లొంగిపోయారన్నారు. దేశ సైన్యం సాధించిన విజయాలపై కాంగ్రెస్‌ పార్టీ ఎన్నడూ రాజకీయాలు చేయలేదన్నారు. రాజకీయ మనుగడ కోసం ప్రతి చిన్న విషయం నుంచి ప్రచార లబ్ధి పొందేందుకు బీజేపీ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఇకపోతే ప్రజల ఆకాంక్ష మేరకు అప్పటి కాంగ్రెస్‌ అధ్యక్షురాలు తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే టిఆర్‌ఎస్‌ అధినేత కెసిఒఆర్‌ అదంతా తన ప్రతఇభ అని చెప్పుకోవడం సరికాదన్నారు. కాంగ్రెస్‌ను తిట్టిపోస్తూ రాజకయీ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని అన్నారు. సోనియాను ‘అమ్మా.. బొమ్మా’అంటూ కేటీఆర్‌ దురుసుగా మాట్లాడడం రాజకీయాల్లో పనికారాదన్నారు.కాంగ్రెస్‌ లేకుంటే తెలంగాణ వచ్చేది కాదని, తమ పార్టీ దయతోనే కేసీఆర్‌ కుటుంబం పాలన సాగిస్తోందని అన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే వారి గొంతులను కేసీఆర్‌ నొక్కేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రధాని మోదీతో చేతులు కలిపి రేవంత్‌రెడ్డిపై ఐటీ దాడులు చేయించి అక్రమ కేసులు పెట్టిస్తున్నారని మండిపడ్డారు. సిట్టింగ్‌ జడ్జితో విచారణ ఎదుర్కొనేందుకు రేవంత్‌ సిద్ధంగా ఉన్నారని, టిఆర్‌ఎస్‌ నేతలు ఎందుకు వెనకాడుతున్నారని ఇందుకు ప్రశ్నించారు.

 

 

తాజావార్తలు