ముందు విూపార్టీలోని..  ముస్లిం నేతల పేర్లు మార్చండి


– పట్టణాలు, నగరాల పేర్లు మార్చడం కాదు
– బీజేపీ నేతలపై మండిపడ్డ ఎస్‌బీఎస్‌పీ చీఫ్‌ రాజ్‌భర్‌
లక్నో, నవంబర్‌10(జ‌నంసాక్షి) : నగరాలు, పట్టణాల పేర్లు మార్చడం కాదని, ముందు బీజేపీలోని నేతల పేర్లు మార్చాలని ఆ పార్టీ భాగస్వామ్య పక్షమైన సుహల్‌ దేవ్‌ భారతీయజనతా పార్టీ (ఎస్‌బీఎస్‌పీ) చీఫ్‌, రాష్ట్ర మంత్రి ఓం ప్రకాష్‌ రాజ్‌భర్‌ అన్నారు. యూపీలోని బీజేపీ ప్రభుత్వం యథేచ్ఛగా వివిధ పట్టణాలు, ప్రాంతాల పేర్లు మారుస్తుండటంపై ఆయన మండిపడ్డారు. శనివారం ఈ మేరకు స్పందిస్తూ.. ప్రధాన పట్టణాలు, ప్రాంతాల పేర్లు మార్చేముందు బీజేపీ తమ పార్టీలోని ముగ్గురు ముస్లిం లీడర్ల పేర్లు మార్చాలని ఆయన డిమాండ్‌ చేశారు. మొఘల్‌ సరాయ్‌, బెజాబాద్‌ల పేర్లను బీజేపీ మార్చిందని, అవి మొఘల్స్‌ పెట్టిన పేర్లను వారు చెబుతున్నారని, బీజేపీలో ముగ్గురు ముస్లిం నేతలున్నారు మర్చిపోయారా అని అన్నారు. జాతీయ ప్రతినిధి షానవాజ్‌ హుస్సేన్‌, కేంద్ర మంత్రి ముఖ్తార్‌ అబ్బాస్‌ నఖ్వి, యూపీ మంత్రి మొహ్‌సిన్‌ రజాలు ఆ పార్టీ వాళ్లేనని బీజేపీ ముందు వాళ్ల పేర్లు కూడా మార్చాలి అని రాజ్‌భర్‌ అన్నారు. బీజేపీ చేస్తున్న పేర్ల మార్పు వ్యవహారమంతా కేవలం వెనుకబడిన తరగతులు, పీడిత ప్రజల సమస్యలను పక్కదోవ పట్టించేందుకేనని విమర్శించారు. వెనుకబడిన, పీడిత వర్గాలు తమ వాణి వినిపించాలనుకు న్నప్పుడల్లా బీజేపీ ఇలాంటి డ్రామాలు ఆడుతుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ ముస్లిం పాలకులు ఏమి కట్టారనేది ప్రశ్న కాదని, జీటీ రోడ్లను విసిరిపారేద్దామా? రెడ్‌ ఫోర్ట్‌ (ఎర్రకోట) కట్టిందెవరు? తాజ్‌మహల్‌ నిర్మించినదెవరు? అని రాజ్‌భర్‌ ప్రశ్నించారు. మోదీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయంపైనా ఆయన నిప్పులు చెరిగారు. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు డబ్బు మొత్తం తిరిగొచ్చేసినప్పుడు నోట్ల రద్దు వల్ల ఎలాంటి ప్రయోజనం ఒనగూరినట్టని ఆయన ప్రశ్నించారు.