ముంపు గ్రామానికి పరిహారం చెల్లించరా?
అనుపురం గ్రామస్థుల ఆందోళన
సిరిసిల్ల,జూలై 23(జనంసాక్షి): మధ్యమానేరు ముంపుగ్రామస్థుల కష్టాలు తీరడం లేదు. వారి పరిహారం ఇంకా పరిహాసంగానే మిగిలింది. పదిసంవత్సరాల నుంచి ఇంటి పరిహారం రాలేదని బాధితులు వాపోతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మానువాడ వద్ద ఏర్పాటు చేస్తున్న మధ్యమానేరు డ్యామ్‌లో ముంపునకు గురవుతున్న అనుపురం గ్రామంలో 16 వందల ఎకరాలు ముంపునకు గురైంది. మరో 150 ఎకరాల భూమికి ఇంకా పరిహారం అందలేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. గ్రామ పంచాయతీ రికార్డు ప్రకారం 728 ఇళ్లకు గాను అందరికీ ఇళ్ల పట్టాలు వచ్చినప్పటికీ రేషన్‌కార్డు ఉండి గ్రామంలోనే నివాసం ఉంటున్న మరో 5 ఇళ్లను పరిగణలోకి తీసుకోలేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. గ్రామంలో ఇప్పటి వరకు సుమారు 150 ఎకరాల భూమికి సంబంధించి ఎలాంటి పరిహారం అందలేదని నిర్వాసితులు చెబుతున్నారు. వ్యవసాయం చేసుకుంటున్న భూములకు ఏ గ్రేడు పరిహారం అందించాలని ప్రభుత్వం చెబుతున్నా వ్యవసాయ భూములకు కూడా అధికారులు సీ గ్రేడు వేసారని చెబుతున్నారు. ఇళ్ల చుట్టూ ఉన్న వ్యవసాయ భూములకు ఇప్పటికీ పరిహారం అందలేదని నిర్వాసితులు వాపోతున్నారు. యువతకు అందించే పరిహారం గురించి ఊసేలేదని వాపోతున్నారు. తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు.