ముంబైని ముంచెత్తుతున్న వర్షాలు

దేశ ఆర్ధిక రాజధాని ముంబైని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వానలతో ముంబైలోని వడాలా, బాంద్రా ఏరియాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపైకి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లోక‌ల్ రైళ్ల‌ను ర‌ద్దు చేశారు. విమానాలు కూడా ఆల‌స్యంగా న‌డుస్తున్నాయి.

దీనికి తోడు కొంకణ్ తీరంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా రానున్న 48 గంటల్లో ముంబైలో కుంభ‌వృష్టి కురిసే అవకాశముందంటూ వాతావరణ శాఖ చేసిన హెచ్చరికలు ముంబై వాసుల‌ను మ‌రింత భ‌యాందోళ‌న‌ల‌కు గురిచేస్తున్న‌ది. ఎలాంటి విప‌త్తునైనా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్న‌ట్లు బృహ‌న్‌ముంబై మున్సిప‌ల్ కార్పొరేష‌న్ (BMC) తెలిపింది. భారీ వ‌ర్షాల‌తో సియోన్‌, దాదర్‌, ముంబై సెంట్ర‌ల్‌, కుర్లా, అంధేరీ, సాకినాక ప్రాంతాల్లో భారీగా నీరు నిలిచిపోయింది. మంగళవారం (ఆగస్టు29) ఉద‌యం నుంచే ఆరు సెంటీమీట‌ర్ల వ‌ర‌కు వ‌ర్షం కురిసింది. అటు స‌ముద్రం ఎగిసిప‌డుతున్న‌ది. సోమ‌వారం (ఆగస్టు28) సాయంత్రం మూడున్న‌ర మీట‌ర్ల ఎత్త‌యిన అల‌లు రికార్డ‌య్యాయి. వ‌చ్చే 24 గంట‌ల్లో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉండ‌టంతో అత్య‌వ‌స‌ర‌మైతే త‌ప్ప ఇంటి నుంచి బ‌య‌ట‌కు రాకూడ‌ద‌ని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.