ముంబైలో కుప్పకూలిన భవంతి

– 19 మంది మృతి

ముంబయి,,ఆగష్టు 31,(జనంసాక్షి): ఓ వైపు భారీ వర్షాలతో అతలాకుతలమవుతున్న దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో ఓ భవనం కుప్పకూలింది. నగరంలోని భిండీ బజార్‌ ప్రాంతంలో గురువారం ఉదయం మూడంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో 19మంది ప్రాణాలు కోల్పోగా.. 13మంది గాయపడ్డారు. సమాచారమందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. అటు ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది కూడా ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు కొనసాగిస్తున్నారు. శిథిలాల కింద మరికొంతమంది ఉండొచ్చని అనుమానిస్తున్నారు. మరోవైపు కనిపించకుండా పోయిన ఓ డాక్టర్‌ డ్రైనేజీలో కొట్టుకుపోయి శవంగా మారాడు. ఇకపోతే ముంబైలోని బిండీ బజార్‌ ప్రాంతంలో మూడు అంతస్తుల ఓ భవనం కుప్పకూలిన ఘటనలో మొత్తం 25 మంది వరకు శిథిలాల కింద చిక్కున్నట్టు భావిస్తున్నారు. హుటాహుటిన రంగంలోకి దిగిన సహాయక బృందాలు ముగ్గురిని బయటికి తీశాయి. ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బందితో పాటు 10 అగ్నిమాపక బృందాలు, అంబులెన్సులు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. 70 ఏళ్ల నాటి ఈ భవనంలో మొత్తం 10 కుటుంబాల వరకు నివసిస్తున్నట్టు చెబుతున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటికి తీసుకొచ్చేందుకు ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

పక్‌మోడియా స్ట్రీట్‌లోని జేజే జంక్షన్‌ దగ్గర ఈ ఘటన జరిగింది. ఉదయం 6.30 నిమిషాలకు బిల్డింగ్‌ కూలినట్లు సమాచారం. అయితే శిథలాల కింద ఎంతమంది చిక్కుకున్నారన్నది అంచనా వేస్తున్నారు. కొద్ది రోజులుగా ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నగరంలో చాలా ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఈ క్రమంలో 971 భవనాలు ఏ క్షణంలో అయినా కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్నట్లు బృహన్‌ ముంబయి మునిసిపల్‌ కార్పొరేషన్‌ గుర్తించింది. మరోవైపు భారీ వర్షాలకు రవాణ వ్యవస్థ స్తంభించిపోయింది. మూడు రోజుల క్రితమే థానే సవిూపంలో దురంతో ఎక్స్‌ప్రెస్‌ కూడా పట్టాలు తప్పింది. కుండపోత వర్షాలతో కుదేలైన ముంబై ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది.గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ముంబై నగరం అస్తవ్యస్తమయిన సంగతి తెలిసిందే. ముంబై రోడ్లన్నీ జలమయమయి.. చెరువులు, నదులను తలపించాయి. రవాణా వ్యవస్థ స్తంభించి పోయింది. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్‌ ఆఫీసులు మూతపడ్డాయి. 2005 లో తర్వాత అంత భారీగా వర్షం కురవడం ఇదే తొలిసారి. అయితే.. రోడ్డుపై నీళ్లు నిలిచిపోవడంతో గత మంగళవారం దీపక్‌ అమరపుర్కర్‌ అనే డాక్టర్‌ కారు దిగి ఎల్ఫిన్‌ స్టోన్‌ లో తన ఇంటికి నీళ్లలో నడుచుకుంటూ వెళ్తున్నాడు. అయితే.. అక్కడ మ్యాన్‌ ¬ల్‌ ఉండటంతో అందులో పడిపోయాడు. ఆ తర్వాత ఆయన జాడ తెలియరాలేదు. ఇక.. బుధవారం సాయంత్రం నుంచి కొంచెం వర్షం ఎడతెరిపి ఇవ్వడం తో ఆయన బాడీ వర్లీలోని ఓ డ్రైనేజ్‌ కాలువ వద్ద లభ్యమయింది. అది ఎల్ఫిన్‌ స్టోన్‌ నుంచి వర్లీకి వెళ్లే డ్రైనేజ్‌ మ్యాన్‌ ¬ల్‌. వర్లీలోని సముద్రం దగ్గర అది ఎండ్‌ అవుతుంది. అక్కడే దీపక్‌ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు కుటుంబ సభ్యులకు అందించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. డా. దీపక్‌ ప్రయాణిస్తున్న కారు వరదనీటిలో చిక్కుకుపోవడంతో ఆయన కారును పక్కన పార్క్‌ చేసి కాలినడక వెళ్లారని.. ప్రమాదవశాత్తు మ్యాన్‌¬ల్‌లో పడిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఆయన ఉపయోగించిన గొడుగును మ్యాన్‌¬ల్‌కు సవిూపంలో గుర్తించినట్లు పేర్కొన్నారు. ముంబయిలో కుంభవృష్టి కారణంగా భారీ వరదలు సంభవించిన విషయం తెలిసిందే.ఇప్పటి వరకు అందిన రికార్డుల ప్రకారం మొత్తం 16 మంది భారీ వర్షాలకు బలయ్యారు.

మృతులకు 5లక్షల ఎక్స్‌గ్రేషియా

ముంబైలో అయిందస్థుల భవనం కూలిన ఘటనలో మృతుల కుటుంబాలకు మహారాష్ట్ర ప్రభుత్వం ఎక్స్‌ గ్రేషియా ప్రకటించింది. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌ గ్రేషియా ఇస్తామని సీఎం ఫడ్నవిస్‌ ప్రకటించారు. కాగా ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 19కి చేరినట్లు అధికారులు వెల్లడించారు. పక్‌మోడియా స్ట్రీట్‌లోని అయిందస్థుల భవన శిథిలాల కింద 35 మందికిపైగా చిక్కుకున్నట్లు భావిస్తున్న అధికారులు, వారిని సురక్షితంగా కాపాడేందుకు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాల సాయంతో సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు.