ముంబైలో ఘోరం

తొక్కిసలాటలో 22 మంది మృతి

ముంబై,సెప్టెంబర్‌ 29,(జనంసాక్షి):: మహారాజధాని ముంబైలో దారుణం జరిగింది. ముంబైలోని స్థానిక రైల్వేస్టేషన్లో విషాదం చోటుచేసుకుంది. ఎలిఫిన్‌ స్టోన్‌ రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాటలో 22మంది మృతి చెందారు. 30 మందికి పైగా గాయపడ్డారు. పండగ కోసం స్వంత ఊర్లకు వెళుతున్న ప్రయాణీకులతో రైల్వే స్టేషన్‌ కిక్కిరిసి ఉన్నప్పుడు.. భారీ వర్షం కురిసింది. ప్రయాణీకులంతా ఒక్కసారిగా ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిపైకి దూసుకురావడంతో ఈ ఘటన జరిగింది. రంగంలోకి దిగిన రైల్వే సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని హాస్పిటల్‌కు తరలిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని జీఆర్‌పీ కమిషనర్‌ నికెట్‌ కౌశిక్‌ తెలిపారు. శుక్రవారం ఉదయం దాదాపు 11 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. మృతుల కుటుంబాలకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ ప్రగాఢ సంతాపం ప్రకటించారు. ‘షార్ట్‌సర్క్యూట్‌ జరిగిందని.. వంతెన కూలిపోతుందని కొందరు ప్రయాణికులు బిగ్గరగా కేకలు వేశారు. దీంతో పాదచారుల వంతెనపై నడుస్తున్న వారు భయభ్రాంతులకు గురై ఒకరినొకరు తోసుకున్నారు. దీంతో మెట్ల విూద జారి పడిపోవడంతో తొక్కిసలాట జరిగింది’ అని అక్కడి ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. ‘మొదట ఇద్దరు పడిపోయారు.. ఆ సమయంలో భారీగా వర్షం కురుస్తోంది. వర్షం ఆగిపోయిన వెంటనే ప్రయాణికులందరూ త్వరగా వెళ్లిపోవాలని ప్రయత్నించారు. ఈ నేపథ్యంలోనే తొక్కిసలాట చోటుచేసుకుంది’ అని మరో ప్రత్యక్ష సాక్షి వెల్లడించారు. అయితే.. ప్రమాదానికి గల కారణాలను మాత్రం రైల్వే అధికారులు నిర్ధారించలేకపోతున్నారు. ఘటనా స్థలాన్ని కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ సందర్శించే అవకాశం ఉంది. ఈ ప్రమాదానికి రైల్వే అధికారుల నిర్లక్ష్యమే కారణమని కొందరు ఆరోపిస్తున్నారు. ఘటనా స్థలానికి ముంబయి మేయర్‌ విశ్వనాథ్‌ మహదేశ్వర్‌ చేరుకొని పరిస్థితిని సవిూక్షిస్తున్నారు. పండగవేళ జరిగిన ఈ దుర్ఘటనలో పెద్దమొత్తంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ స్టేషన్లో లోకల్‌ రైళ్లు ఎక్కువగా ఆగుతుంటాయి. అంతేగాక.. ఈ ప్రాంతంలో ఆఫీసులు కూడా ఎక్కువే. దీంతో సాధారణంగానే ఈ ప్రాంతం ప్రయాణికులతో కిటకిటలాడుతుంటుంది. శుక్రవారం కూడా అలాగే చాలా మంది ప్రయాణికులు వచ్చారు. అయితే ఉదయం వర్షం పడటంతో వారంతా కాసేపు అక్కడే ఉన్నారు. వర్షం ఆగిపోయిన తర్వాత ఒక్కసారిగా ప్రయాణికులంతా పాదచారుల వంతెనపైకి దూసుకొచ్చారు. దీంతో తొక్కిసలాట జరిగింది. ఉదయం 10.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ సమయంలో స్టేషన్‌కు నాలుగు రైళ్లు ఒకేసారి వచ్చాయి. దీంతో ప్రయాణికులు హడావుడిగా వెళ్లే క్రమంలో ఒకరినొకరు తోసుకోవడంతో కొందరు కిందపడిపోయారు. తొక్కిసలాట నుంచి తప్పించుకునేందుకు కొందరు వంతెన కడ్డీలు పట్టుకుని కిందకు దూకేశారు. ఈ ఘటనలో తొలుత 22 మంది మృతిచెందగా.. పదుల సంఖ్యలో ప్రయాణికులు గాయపడ్డారు. వీరిలో 20 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. సమాచారమందుకున్న పోలీసులు, వైద్య సిబ్బంది రైల్వేస్టేషన్‌కు చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. క్షతగాత్రులకు వైద్యసాయం అందించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్‌ విూడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఘటనపై పశ్చిమ రైల్వే స్పందించింది. పండగ వేళ ఇది చాలా దురదృష్టకరమని, రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌ ఘటనాస్థలానికి వస్తారని రైల్వే పీఆర్వో అనిల్‌ సక్సేనా తెలిపారు. ‘భారీ వర్షం కారణంగా పెద్దసంఖ్యలో ప్రయాణికులు వంతెనపైకి చేరుకున్నారు. వర్షం ఆగిపోగానే వారంతా దిగేందుకు ప్రయత్నించగా.. తొక్కిసలాట జరిగింది’ అని సక్సేనా తెలిపారు.

పోలీసుల కథనం ప్రకారం.. సాధారణంగానే స్థానిక ఎల్ఫిన్‌స్టోన్‌ రైల్వే స్టేషన్‌ ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. ఈ క్రమంలో ముంబై సబర్బన్‌ రైల్వే నెట్‌వర్క్‌లో ఉన్న ఈ స్టేషన్‌కు శుక్రవారం భారీ సంఖ్యలో ప్రయాణికులు వచ్చారు. అయితే ఒక్కసారిగా వర్షం కురవడంతో ప్రయాణికులు ఉరుకులు పరుగులు పెట్టడంతో ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిపై తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ తొక్కిసలాటలో 15 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 25 మంది గాయపడ్డట్లు సమాచారం. ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు, రైల్వే పోలీసులు వెంటనే రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దారు. గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

ముంబై ఘటనపై రాష్ట్రపతి దిగ్భాంతి

ముంబయి రైల్వేస్టేషన్‌లో జరిగిన ప్రమాదంపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. ‘తొక్కిసలాట కారణంగా ప్రాణాలు కోల్పోవడం విచారకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నా. గాయపడిన వాళ్లు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా’ అని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ట్విటర్‌ ద్వారా తన సానుభూతిని తెలిపారు. స్థానిక ఎల్ఫిన్‌స్టోన్‌ రైల్వేస్టేషన్‌ వద్ద ప్రయాణికులు నడిచే వంతెనపై తొక్కిసలాట జరిగి 22 మంది ప్రాణాలు కోల్పోగా.. పలువురు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. మృతుల్లో 14 మంది పురుషులు, ఎనిమిది మంది మహిళలు ఉన్నారు. క్షతగాత్రులను కేఈఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

హాయక చర్యల్లో పాల్గొనేందుకు ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుల వివరాలను తెలుసుకునేందుకు బృహన్‌ ముంబయి కార్పొరేషన్‌(బీఎంసీ) హెల్ప్‌లైన్లను ఏర్పాటు చేసింది. 022-24136051, 022-24107020, 022-24131419 నెంబర్లకు ఫోన్‌ చేసి వివరాలను తెలుసుకోవచ్చన బీఎంసీ వెల్లడించింది.

ముంబై దుర్ఘటనప విచారణ: సిఎం ఫడ్ణవీస్‌

ప్రభాదేవి రైల్వేస్టేషన్‌ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై మహారాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనపై విచారణ జరిపిస్తామని ఆ రాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ స్పష్టం చేశారు. ఈ ఘటన తీవ్రంగా కలచి వేసిందని అన్నారు. ఒకేసారి వందలాది మంది ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిపైకి రావడంతో.. జరిగిన తొక్కిసలాటలో 22 మంది ప్రాణాలు కోల్పోయినా అది 50కి పెరిగిందని అంటున్నారు. ఈ ఘటనలో మరో 50 మందికి పైగా గాయపడ్డారు. ఈ ప్రమాద ఘటనపై రైల్వే అధికారులతో కలిసి విచారణ జరిపిస్తామని ఆ రాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ స్పష్టం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇస్తున్నట్లు మంత్రి వినోద్‌ తావ్‌డే ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలన్న ఆయన.. వారి వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని మంత్రి తెలిపారు.