ముంబైలో భారీ అగ్నిప్రమాదం

ప్రముఖులు ఉండే అపార్ట్‌మెంట్లో ప్రమాదం

పెద్ద ఎత్తున సమాయక చర్యలు

ఎవరికి ప్రమాదం లేదన్న అధికారులు

ముంబయి,జూన్‌13(జ‌నం సాక్షి ): దక్షిణ ముంబయిలోని వర్లి ప్రాంతంలోని బహుళ అంతస్తుల భవన సముదాయంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అబ్బాసాహేబ్‌ మరాఠే మార్గ్‌లో ఉన్న బ్లూమౌంట్‌ టవర్స్‌లోని 33వ అంతస్తులో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో భవనంలోని పై రెండు అంతస్తులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ భవనంలోనే కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌, బాలీవుడ్‌ నటి దీపికా పదుకొణె సహా పలువురు సెలబ్రిటీలు, ప్రముఖుల నివాసాలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు. మంటలను నియంత్రించేందుకు శతవిధాలా ప్రయత్నించారు. ఘటనా స్థలికి చేరుకొన్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు యత్నించారు. . తొలుత లెవల్‌ 2గా ఉన్న ప్రమాదం.. ఆ తర్వాత లెవల్‌ 3గా మారింది. 10 ఫైరిరజన్లు, ఐదు జంబో ట్యాంకర్లు, 2 హైడ్రాలిక్‌ ప్లాట్‌ఫాంలు సహాయకచర్యల్లో పాల్గొన్నాయి. సహాయక సిబ్బంది 95 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.గాలులు వీయడంతో సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడింది. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో ఘటనా స్థలికి చేరుకున్నప్పటికీ 33వ అంతస్తులో వ్యాపించిన మంటలు ఆర్పేందుకు ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో పక్కనే ఉన్న మరో టవర్‌పైకి చేరుకొని మంటల్ని పూర్తిగా అదుపుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. గాలులు వీస్తుండటంతో సహాయక చర్యలకు ఆటంకంగా మారింది. మంటలు మరింత వ్యాపించే అవకాశం ఉండటంతో అవసరమైతే హెలీకాఫ్టర్‌ ద్వారా సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ నష్టం జరిగినట్టు సమాచారం లేదు. ఈ ప్రమాదంతో జనాలు రోడ్లపైకి రావడంతో చుట్టుపక్కల ప్రాంతంలో ట్రాఫిక్‌ సమస్య తలెత్తింది.

26వ అంతస్తులో దీపిక నివాసం..

బాలీవుడ్‌ నటి దీపికా పదుకొణెళి ఇదే అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్నారు. ఆమె ఫ్లాట్‌ 26వ అంతస్తులో ఉంది. అయితే ప్రమాదం సమయంలో ఆమె భవనంలో లేరని దీపిక పీఆర్‌ బృందం వెల్లడించింది. ’26వ అంతస్తులోని ఫ్లాట్‌లో దీపిక నివాసముంటున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో దీపిక ఇంట్లో లేరు. బ్రాండ్‌ షూటింగ్‌ నిమిత్తం వెళ్లారు. అయితే ఆమె సిబ్బంది కొందరు ఫ్లాట్‌లోనే ఉన్నారు. వారంతా క్షేమంగానే ఉన్నారు. దీపిక ఇంటికి కూడా ఎలాంటి ప్రమాదం జరగలేదు’ అని పీఆర్‌ బృందం విూడియాకు తెలిపింది.