ముంబై రైలుబాంబు పేలుళ్ల కేసులో 12 మందిని దోషులుగా గుర్తించిన కోర్టు

2

మహారాష్ట్ర, సెప్టెంబర్‌ 11 : 2006 ముంబై రైళ్లలో బాంబు పేలుళ్ల కేసులో 12 మంది దోషులుగా నిర్ధారిస్తూ మకోకా కోర్టు శుక్రవారం తీర్పును వెలువడించింది. అబ్దుల్‌ షేక్‌ అనే నిందితుడిని మాత్రం నిర్దోషిగా ప్రకటించి వదిలేసింది. దోషులకు శిక్షా పరిమాణంపై సోమవారం వాదోపవాదాలు జరుగుతాయి. 2006 జూలై 11న ముంబైలోని ఏడు లోకల్‌ రైళ్లలో వరుస బాంబు పేలుళ్లు జరిగాయి. లష్కరే తయ్యబా ప్రేరేపిత ఉగ్రవాదులు ఆర్డీఎక్స్‌ ఉపయోగించి ఈ విధ్వంసానికి పాల్పడ్డారు. అన్నీ ఫస్ట్‌ క్లాస్‌ బోగీల్లోనే పేలుళ్లు జరిగాయి. పేలుళ్ల ధాటికి రైలు బోగీలు చిన్నాభిన్నమయ్యాయి. రైల్వేస్టేషన్ల పైకప్పులు ఎగిరిపోయాయి. ఈ బాంబు పేలుళ్లలో 188 మంది ప్రయాణికులు మృతి చెందగా, 829 మంది తీవ్రంగా గాయపడ్డారు. కొన్ని బోగీల్లో శవాలు గుట్టలు గుట్టలుగా పడున్నాయి. వెంటనే రంగంలోకి దిగిన ముంబై పోలీసులు, కార్పొరేషన్‌ అధికారులు, క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. ఈ కేసు విచారణ దాదాపు ఎనిమిది సంవత్సరాలు సాగింది. విచారణపై 2008లో స్టే విధించిన సుప్రీం కోర్టు 2010 ఏప్రిల్‌ 23న స్టే ఎత్తివేసింది. ఈ కేసుకు సంబంధించి మొత్తం 13 మంది నిందితులను దశలవారీగా అరెస్ట్‌ చేశారు. లష్కరే తయ్యబా ఆపరేటివ్‌ అజీం సహా 14 మంది పరారీలో ఉన్నారు. పరారీలో ఉన్న ఉగ్రవాదుల కోసం వేట ఇంకా కొనసాగుతూనే ఉందని ప్రభుత్వం ప్రకటించింది. విచారణలో 192 మంది సాక్షులను కోర్టు ప్రశ్నించింది. చివరగా ఈరోజు 12 వ

ుందిని మకోకా కోర్టు దోషులుగా తేల్చింది.