ముక్కోటి ఏకాదశికి ప్రత్యేక ఏర్పాట్లు
ఖమ్మం, డిసెంబర్ 11 : పవిత్ర పుణ్యక్షేత్రమైన భద్రాచలంలో ఈ నెల 23న అంగరంగ వైభవంగా శ్రీ సీతారామచంద్రస్వామివారి తెప్పోత్సవం, 24న స్వామివారి ఉత్తర ద్వార దర్శనంతో ముక్కోటి ఉత్సవాలను దర్శించుకునేందుకు భక్తులు రానున్నందున అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని భద్రాచలం ఎమ్మెల్యే సత్యవతి మంగళవారం అధికారులకు సూచించారు. రాష్ట్రం నలుమూలల నుంచి ముక్కోటి ఏకాదశికి అధిక సంఖ్యలో భక్తులు తరలిరానున్నందున ఏర్పాట్లు విస్తృతంగా ఉండాలని ఆమె అన్నారు. రాజమండ్రి, ఇల్లేందు, కొత్తగూడెం నుంచి దాదాపు 200మంది ప్రత్యేక పారిశుద్ధ్య ఏర్పాట్లను చేసేందుకు సిబ్బందిని రప్పిస్తున్నట్లు ఆమె చెప్పారు. గోదావరి వద్ద మహిళలు, పురుషులు, పిల్లలు, వృద్ధులు స్నానాలు చేసేందుకు లోతుకు దిగకుండా బారికెడ్లను ఏర్పాటు చేయనున్నారు. స్నానాలు చేసిన వారికి బట్టలు మార్చుకోవడానికి ప్రత్యేక షెడ్లను ఏర్పాటు చేస్తున్నాట్లు చెప్పారు. స్వామివారి తెప్పోత్సవానికి రాజమండ్రి నుంచి లాంచీని తెప్పిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఉత్సవాల సందర్భంగా భక్తులెవ్వరూ కూడా ప్లాస్టిక్ వస్తువులు వినియోగించరాదని ఆమె అన్నారు.