ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారి పెద్దపల్లి జిల్లా పర్యటన – వివరాలు :
,ఆగష్టు 29 ,(జనం సాక్షి )
పెద్దపల్లి జిల్లాలో నూతనంగా నిర్మించిన సమీకృత జిల్లా కార్యాయాల భవన సముదాయం (కలెక్టరేట్ కాంప్లెక్స్) ను ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారు సోమవారం మధ్యాహ్నం 1.30 గంటలకు హైదరాబాద్ ప్రగతి భవన్ నుంచి బయలుదేరారు. నేరుగా బేగంపేట విమానాశ్రయానికి వెళ్లిన సీఎం, అక్కడి నుంచి హెలీకాప్టర్లో 2.30 గంటలకు పెద్దపల్లికి చేరుకున్నారు. సీఎంకు పెద్దపల్లి జిల్లా నేతలు, అధికారులు ఘనంగా స్వాగతం పలికారు.
టీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం :
గౌరెడ్డిపేటలో నిర్మించిన టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ మధ్యాహ్నం 2.40 గంటలకు ప్రారంభించారు. పార్టీ కార్యాయంలో ముఖ్యమంత్రి ప్రత్యేక పూజలు చేశారు. పెద్దపల్లి జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ను సీటులో కూర్చుండబెట్టి, ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత పార్టీ కార్యాయంలో టీఆర్ఎస్ జెండాను సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు.
కలెక్టరేట్ ను ప్రారంభించిన సీఎం కేసీఆర్ :
మధ్యాహ్న భోజనం అనంతరం 3.50 గంటలకు పెద్ద బొంకూరు శివారు కల్వల క్యాంపులో నిర్మించిన సమీకృత ప్రభుత్వ కార్యాలయాల సముదాయమైన కలెక్టరేట్ వద్దకు సీఎం కేసీఆర్ చేరుకున్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.
అర్చకులు పూర్ణకుంభంతో ముఖ్యమంత్రికి ఘనంగా స్వాగతం పలికారు. ఆ తర్వాత కల్వల క్యాంపులో నిర్మించిన పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ సముదాయం శిలా ఫలకాన్ని సీఎం కేసీఆర్ సాయంత్రం 4 గంటలకు ఆవిష్కరించి, కలెక్టరేట్ ను ప్రారంభించారు. ఒక్కదగ్గరే 41శాఖల కార్యాలయాలతో నిర్మించిన కలెక్టరేట్ భవన సముదాయాన్ని ముఖ్యమంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక పూజలు చేశారు. కలెక్టర్ ఛాంబర్లో నిర్వహించిన సర్వమత ప్రార్థనల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. కలెక్టర్ చాంబర్ లోని కుర్చీలో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ సర్వే సంగీతను సీఎం కేసీఆర్ కూర్చుండబెట్టి, ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత ఏవిధంగా స్ఫూర్తిదాయకంగా పనిచేశామో, అలాగే ముందుకు పోవాలని ఈ సందర్భంగా సీఎం కోరారు. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ వెంట ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్,ఎంపీలు దామోదర్ రావు, వెంకటేష్ నేతకాని, ఎమ్మెల్సీలు టి.భానుప్రసాదరావు, ఎల్.రమణ, పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్యేలు దాసరి మనోహర్‌రెడ్డి, కోరుకంటి చందర్, కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, బాల్క సుమన్, సుంకె రవిశంకర్, జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, హుజూరాబాద్ టీఆర్ఎస్ ఇన్ చార్జ్ గెల్లు శ్రీనివాస్ యాదవ్, పోలీసు హౌజింగ్ బోర్డు చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా, చిరుమిల్ల రాకేశ్, రాఘవ యాదవ్, ఈద శంకర్ రెడ్డి, కిషన్ రావు తదితరులు పాల్గొన్నారు.
పాల్గొన్న అధికారులు :
కార్యక్రమం లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సీఎం సెక్రటరీ స్మితా సభర్వాల్, ఆర్ అండ్ బి ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు, కలెక్టర్ సర్వే సంగీత సత్యనారాయణ, అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, ఆర్ అండ్ బీ ఈఎన్సీ గణపతి రెడ్డి, నిర్మాణ సలహాదారు సుద్దాల సుధాకర్ తేజ, ఐజీ నాగిరెడ్డి, రామగుండం ఇన్ చార్జ్ సీపీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.