ముగిసిన అయోధ్య వివాదం

– 134 ఏళ్ల వివాదానాకి తెర..
– ఆమోధ్యలో రామమందిరానికి సుప్రీం గ్రీన్‌సిగ్నల్‌
– అయోధ్యలోనే మసీదు నిర్మాణానికి ఐదెకరాల స్థలం
– స్థలాన్ని సున్నీ బోర్డుకు ఇవ్వాలన్న సుప్రీం
– ఏకగ్రీవంగా తీర్పు ప్రకటించిన న్యాయస్థానం
– 1045 పేజీల్లో తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ, నవంబర్‌ 9(జనంసాక్షి): దశాబ్దాల కాలం పాటు వివాదాలు, న్యాయస్థానాల మధ్య నలిగిన రామజన్మభూమి, బాబ్రీ మసీదు వివాదంపై సుప్రీం కోర్టు చారిత్రాత్మకమైన తీర్పును శనివారం వెల్లడించింది. అయోధ్యలోని వివాదాస్పద 2.77 ఎకరాల భూమిని రామజన్మభూమి న్యాస్‌కు అప్పగించాలని, అప్పటి వరకు ఇది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండాలని సంచలన తీర్పు ఇచ్చింది. ఈ క్రమంలో అయోధ్య యాక్ట్‌ కింద ట్రస్ట్‌ మూడు నెలల్లో ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అయోధ్యలోనే మసీదు నిర్మాణానికి ఐదు ఎకరాల స్థలం ఇవ్వాలని సూచించింది. స్థలాన్ని సున్నీ బోర్డుకు ఇవ్వాలని ఆదేశించింది. భూ కేటాయింపునకు కేంద్రం ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని తెలిపింది. 1993లో ప్రభుత్వం సేకరించిన స్థలంలో అయినా సున్నీ బోర్డుకు స్థలాన్ని కేటాయించవచ్చని పేర్కొంది. జస్టిస్‌ గొగోయ్‌, జస్టిస్‌ బాబ్డే, జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌, జస్టిస్‌ ఎస్‌ఏ నజీర్‌, జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌లతో కూడిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం భిన్నాభిప్రాయాలను తావు లేకుండా ఒకే తీర్పు ఇచ్చింది.
తీర్పు ఇలా సాగింది..
తొలుత వివాదాస్పద స్థలంపై షియా వక్ఫ్‌ బోర్డు, నిర్మోహి అఖాడా పిటిషన్లను ధర్మాసనం కొట్టివేసింది. రాముడు అయోధ్యలో జన్మించాడన్నది నిర్వివాదాంశమని. యాజమాన్య హక్కులనేవి నిర్ధేశిత న్యాయ సూత్రాల ప్రకారం నిర్ణయిస్తామని చీఫ్‌ జిస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ వ్యాఖ్యానించారు. ప్రధాన గుమ్మటం కింద గర్భాలయం ఉందని హిందువులు విశ్వసిస్తున్నారని, రెండు మతాలు వివాదాస్పద స్థలంలో ప్రార్థనలు చేసేవని తెలిపారు. రాముడు అయోధ్యలోనే జన్మించాడని ముస్లింలు కూడా అంగీకరిస్తారన్నారు. మసీదు నిర్మాణానికి ముందే ఆ స్థలంలో ఒక నిర్మాణం ఉందని, వివాదాస్పద స్థలంలో మసీదు లేదని, అక్కడ హిందు నిర్మాణం ఉందని పురావస్తు విభాగం చెబుతోందని సుప్రీంకోర్టు పేర్కొంది. యాజమాన్య హక్కులనేవి నిర్దేశిత న్యాయ సూత్రాల ప్రకారం నిర్ణయిస్తామని, న్యాయమూర్తి ఆదేశాలు ఉన్నప్పుడే 47వ అధికరణం వర్తిస్తుందని చీఫ్‌ జస్టిస్‌ స్పష్టంచేశారు. 12 ఏళ్ల తర్వాత సున్నీ వక్ఫ్‌ బోర్డ్‌ వ్యాజ్యం దాఖలు చేసిందని, మొఘలుల సమయం నుంచే హక్కు ఉన్నట్లు నిరూపించలేకపోయిందని పేర్కొన్నారు.శుక్రవారం రోజు ముస్లింలు ప్రార్థనలు చేసినట్లు మాత్రమే ఆధారాలు సమర్పించిందని వ్యాఖ్యానించారు. అయోధ్యలోని వివాదాస్పద స్థలాన్ని పంచుకోవాలంటూ గతంలో ఇచ్చిన అలహాబాద్‌ హైకోర్ట్‌ తీర్పును సుప్రీం కోర్టు తప్పు పట్టింది. వివాదాస్పద స్థలాన్ని పంచే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. వివాదాస్పద భూమి మొత్తం రామ మందిర నిర్మాణానికి సుప్రీంకోర్టు కేటాయించింది. అయోధ్యలో ముస్లింలకు ఐదు ఎకరాల భూమి కేటాయించాలని యూపీ, కేంద్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. మసీదు నిర్మాణం కోసం ప్రత్యామ్నాయ స్థలాన్ని ఏర్పాటు చేయాలని తెలిపింది. పురావస్తు శాఖ నివేదికల ఆధారంగా నిర్ణయం తీసుకుంటున్నామని సీజేఐ వెల్లడించారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం వివాదాస్పద స్థలం ప్రభుత్వానికి చెందిందని పేర్కొన్నారు. వివాదాస్పద స్థలంపై ఎవరూ యాజమాన్య హక్కులు కోరలేదని వివరించారు. నిర్ణయానికి ముందు రెండు మతాల విశ్వాసాలను పరిగణనలోకి తీసుకున్నామని సీజేఐ పేర్కొన్నారు. అక్కడ మందిరం ఉన్నట్లు పురావస్తు శాఖ నివేదికలు చెబుతున్నాయని తెలిపారు.
షియా వక్ఫ్‌ బోర్డ్‌, నిర్మోహీ పిటీషన్లు కొట్టివేత..
అయోధ్య భూమి హక్కుపై షియా వక్ఫ్‌ బోర్డ్‌ వేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ… ఏకగ్రీవ తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు. వివాదాస్పద భూమి తమదేనని షియా వక్ఫ్‌ బోర్డు తన పిటిషన్‌లో తెలిపింది. దీన్ని సుప్రీంకోర్టు కొట్టివేయడంతో… వివాదాస్పద భూమి షియా వక్ఫ్‌ బోర్డ్‌ది కాదని స్పష్టం చేసింది. తీర్పు వెల్లడించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గొగోయ్‌… ప్రజల విశ్వాసాల్నీ, నమ్మకాల్నీ సుప్రీంకోర్టు గౌరవిస్తుందని తెలిపారు. బాబర్‌ కాలంలో మసీదు నిర్మాణం జరిగిందన్న సుప్రీంకోర్టు… ఐతే… కచ్చితంగా మసీదు ఎప్పుడు నిర్మించిందీ స్పష్టం కాలేదని తెలిపింది. ఆర్టికల్‌ 120 కింద నిర్మోహీ అఖాడా వేసిన పిటిషన్‌ను కూడా సుప్రీంకోర్టు కొట్టివేసింది. అందువల్ల హీందూ పార్టీల్లో ఒకటైన నిర్మోహీ అఖాడా వేసిన పిటిషన్‌ తొలగిపోయన్లటైంది. మసీదు నిర్మాణం ఖాళీ స్థలంలో జరగలేదన్న సుప్రీంకోర్టు… గతంలో అక్కడో నిర్మాణం ఉండేదని తెలిపింది. ఐతే… అక్కడ రామ దేవాలయమే ఉంది అనేందుకు ఆధారాలు లేవని పురావస్తు శాఖ తెలిపిన విషయాన్ని సుప్రీంకోర్టు ఏకీభవించింది. శ్రీ రామ్‌ లాలా విరాజ్‌మాన్‌ పిటిషన్‌పై స్పందించిన సుప్రీంకోర్టు… మసీదు కింద నిర్మాణం ఉన్నంత మాత్రాన… ఆ భూమిపై హక్కును పొందే అవకాశం ఉండదని తెలిపింది. ఒకవేళ అక్కడ హిందూ ఆలయం ఉన్నా ఇదే వర్తిస్తుమంది అభిప్రాయపడింది.
సంతృప్తికరంగా లేదు.. అయినా గౌరవిస్తాం – సున్నీ వక్ఫ్‌ బోర్డు
అయోధ్య కేసులో సుప్రీంతీర్పుపై సున్నీవక్ఫ్‌ బోర్డు అసంతృప్తి వ్యక్తం చేసిందని, వక్ఫ్‌ బోర్డు తరఫు న్యాయవాది షేక్‌ అహ్మద్‌ సయ్యద్‌ మాట్లాడుతూ.. తీర్పు సంతృప్తికరంగా లేదని, అయినా గౌరవిస్తామన్నారు. తీర్పు కాపీని మరింత పరిశీలించాల్సి ఉందని.. ఆ తర్వాతే భవిష్యత్‌ కార్యాచరణ రూపొందించుకుంటామన్నారు. అందరూ శాంతియుతంగా ఉండాలని, ఎలాంటి నిరసన కార్యక్రమాలు చేపట్టరాదని ఆయన విజ్ఞప్తి చేశారు.
అయోధ్య తీర్పు చారిత్రాత్మకం – కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌
అయోధ్య రామ జన్మభూమి – బాబ్రీ మసీదు కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు చారిత్రాత్మకమైనదని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కొనియాడారు. అయోధ్య వివాదంపై   సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో ఆయన ట్విటర్లో స్పందిస్తూ.. ఇది చారిత్రక తీర్పు అని నేను నమ్ముతున్నానని అన్నారు. ప్రతిఒక్కరూ దీన్ని అంగీకరించి, గౌరవించాలని అన్నారు. ప్రజలంతా శాంతి, సామరస్యాలు పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నామని పేర్కొన్నారు.
సుప్రీం తీర్పు సంతృప్తికరంగా లేదు – ముస్లిం పర్సనల్‌ లా బోర్డు రియాక్షన్‌
సుప్రీంకోర్టు తీర్పుపై ముస్లిం పర్సనల్‌ లా బోర్డు స్పందించింది. అయితే ఇందులో తమకు ఆమోదయోగ్యం కాని విషయాలు కూడా ఉన్నాయని పేర్కొంది. మరొక్కసారి దృష్టిసారించాల్సిందిగా
సుప్రీంకు విన్నవిస్తామని తెలిపింది. న్యాయపరంగా ఎలా అడుగువేయాలో త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. సుప్రీంకోర్టు తీర్పు తమకు సంతృప్తికరంగా లేదన్నారు. ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సమావేశంలో చర్చించాల్సిన విషయాలు ఉన్నాయని, 15వ శతాబ్దానికి ముందు ఆధారాలు ఉన్నాయి అంటే.. 15వ శతాబ్దం తర్వాత కూడా ఆధారాలు ఉంటాయి కదా అని ముస్లిం పర్సనల్‌ లా బోర్డు ప్రశ్నించింది. తీర్పు పూర్తి సారాంశం చదివిన తరువాత తమ నిర్ణయం ప్రకటిస్తామని తెలిపారు.
విద్వేషాలను రెచ్చగొట్టేలా ప్రవర్తించవద్దు – బాబా రాందేవ్‌
దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న అయోధ్య తీర్పును సుప్రీం కోర్టు వెలువరించిన నేపథ్యంలో ఎవరూ మతం పేరుతో విద్వేషాలను రెచ్చగొట్టవద్దని యోగ గురు బాబా రాందేవ్‌ ప్రజలను కోరారు. ప్రజలంతా శాంతియుతంగా ఉండాలని, సుప్రీం తీర్పును గౌరవించాలని విన్నవించారు. భారత దేశంలో నివశించే వివిధ మతాల ప్రజలందరూ కలిసిమెలిసి, శాంతియుతంగా జీవిస్తారని, మన దేశం పూర్తి స్థాయి ప్రజాస్వామ్య దేశమని ప్రపంచానికి నిరూపించాలని పిలుపునిచ్చారు.
అయోధ్య తీర్పు కేంద్రం గొప్పతనమేవిూ కాదు – ఉద్ధవ్‌ థాకరే
అయోధ్య తీర్పు కేంద్రం గొప్పతనమేవిూ కాదని శివసేన అధినేత ఉద్ధవ్‌ థాకరే విమర్శించారు. అయోధ్యలో రామమందిరం నిర్మాణం గురించి తాము ఎప్పుడో కేంద్రాన్ని కోరామని, అయితే కేంద్రం పట్టించుకోలేదని ఆయన చెప్పారు. అలాంటిది ఇప్పుడు రామ జన్మభూమిని రామునికే ఇస్తూ సుప్రీం కోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో అదంతా తమ గొప్పతనమేనంటూ కేంద్రం చెప్పుకోకూడదని ఆయన హితవు పలికారు.
సుప్రీం తీర్పును గౌరవించండి – రామమందిర్‌ ప్రధాన అర్చకుడు సత్యంద్ర
అయోధ్యపై సుప్రీం కోర్టు తీర్పును అందరూ గౌరవించాలని రామమందిర్‌ ప్రధాన అర్చకుడు సత్యేంద్ర దాస్‌, ఆల్‌ ఇండియా ముస్లిం లా బోర్డ్‌  కార్యదర్శి ఖలీద్‌ రషీద్‌ శనివారం కోరారు. సుప్రీం తీర్పును ప్రజలంతా ఏకగ్రీవంగా ఆమోదించాలని, దీనిని ఎవరో ఒకరి గెలుపుగానో, ఓటమిగానో చూడవద్దని సత్యేంద్ర దాస్‌ విన్నవించారు. అలాగే అయోధ్యలో శాంతి భద్రతలను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం రక్షణ దళాలను మొహరించడం పై ఆనందం వ్యక్తం చేశారు. ఏఐఎంపీఎల్‌బీ సభ్యుడు ఖలీద్‌ రషీద్‌ మాట్లాడుతూ ఎంతో కాలంగా దేశం మొత్తం ఎదురు చూస్తున్న రోజు వచ్చిందన్నారు. సుప్రీం కోర్టు తీర్పును ప్రజలంతా ఆమోదించాలని కోరారు. అలాగే దేశంలోని పార్టీలు, నాయకులు, ఆర్‌ఎస్‌ఎస్‌, జమాత్‌ ఉలేమా ఈ హింద్‌ వంటి సంస్థలు అయోధ్య పట్ల వ్యవహరిస్తున్న తీరును అభినందించారు.
సుప్రీం తీర్పును అందరూ గౌరవించాలి – సీపీఐ నేత సురవరం
అయోధ్యపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అందరూ గౌరవించాలని సీపీఐ నేత సురవరం సుధాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. సుప్రీం తీర్పు అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.. సుప్రీంకోర్టు ధర్మాసనం తన విచక్షణతో ఇచ్చిన తీర్పు ఇదన్నారు. తీర్పు అందరినీ సంతృప్తి పరచలేకపోయినా అత్యున్నత న్యాయస్థానాన్ని గౌరవించాలన్నారు. ప్రజలంతా శాంతి, సహనంతో ఉండాలని ఈ సందర్భంగా సురవరం పిలుపునిచ్చారు.
సంయమనం పాటించండి – ఏపీ సీఎం జగన్‌
అయోధ్యలోని రామజన్మభూమి- బాబ్రీ మసీదు కేసులో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో ప్రజలంతా సంయమనం పాటించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విఙ్ఞప్తి చేశారు.
అయోధ్యలో నిర్మాణంపై తీర్పునకు కట్టుబడి ఉంటామని ఇరుపక్షాలూ సుప్రీంకోర్టుకు తెలియజేసిన విూదటే.. ఈ కేసులో భారతదేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువరించిందన్నారు. ఇటువంటి పరిస్థితులలో  మత సామరస్యానికి భంగం కలిగించేలా, రెచ్చగొట్టేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదని అన్ని వర్గాలకూ విజ్ఞప్తి చేశారు. సంయమనం పాటించి శాంతి భద్రతలకు సహకరించాల్సిందిగా కోరారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు.
అద్వానీ, సింఘాల్‌ సాధించారు – కేఎన్‌ గోవిందాచార్య
అయోధ్య వివాదంలో సుప్రీంకోర్టు తీర్పును ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్దాంతకర్త, రామ జన్మభూమి రథయాత్రలో కీలక పాత్రధారి కేఎన్‌ గోవిందాచార్య స్వాగతించారు. ఈ కేసులో తీర్పు తమకు అనుకూలంగా రావడానికి విశ్వ హిందూ పరిషత్‌(వీహెచ్‌పీ) నేత అశోక్‌ సింఘాల్‌, ఎల్‌కే అద్వానీ చేసిన కృషే కారణమని ఆయన వ్యాఖ్యానించారు. ‘సుప్రీంకోర్టు తుది తీర్పు చాలా సంతోషం కలిగించింది. ఇక మూడు నెలల్లో రామమందిరం నిర్మాణానికి ప్రణాళిక రూపొందించాలని ఆయన అన్నారు. ప్రజలంతా సంయమనంతో మెలగాలని, మత సామరస్యం పాటించాలని కోరారు. ఈ విజయానికి ప్రధాన కారణం ఎవరు అనుకుంటున్నారని ప్రశ్నించగా.. ఆలయ నిర్మాణం కోసం లక్షలాది మంది త్యాగాలు చేశారని, చాలా మంది అనేక రకాలుగా రామ జన్మభూమి ఉద్యమంలో తమ పాత్ర పోషించారు. కీలక భూమిక మాత్రం అశోక్‌ సింఘాల్‌, ఎల్‌కే అద్వానీదే అని సమాధానం ఇచ్చారు. అదేవిధంగా అయోధ్య వివాదంలో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు చరిత్రాత్మకమని హిందూ మహాసభ తరపు న్యాయవాది వరుణ్‌కుమార్‌ సిన్హా వ్యాఖ్యానించారు. భిన్నత్వంలో ఏకత్వం సందేశాన్ని ఇచ్చేలా తీర్పు ఉందన్నారు. సుప్రీంకోర్టు తీర్పు బాలెన్స్‌డ్‌గా ఉందని, ఇది ప్రజల విజయమని రామ్‌ లల్లా తరపు న్యాయవాది సీఎస్‌ వైద్యనాథన్‌ అన్నారు.