ముగిసిన గౌతమ్రెడ్డి అంత్యక్రియలు

భారీగా తరలివచ్చిన అభిమానులు
సిఎం జగన్‌ దంపతులు తుది వీడ్కోలు
మంత్రులు,ప్రజాప్రతినిధులు హాజరు
దారిపొడవునా గౌతమ్‌ అమర్‌ హై అంటూ నినాదాలు
నెల్లూరు,ఫిబ్రవరి23(జనం సాక్షి): అశ్రునయనాల మధ్య, కడసారి చూపు కోసం తరలివచ్చిన వేలాదిమంది అభిమానుల మధ్య ఆంధ్రప్రదేశ్‌ మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి అంత్యక్రియలు పూర్తయ్యాయి. నెల్లూరులోని ఆయన ఇంటినుంచి బుధవారం ఉదయం ప్రారంభమైన అంతిమయాత్ర ఉదయగిరిలోని మేకపాటి రాజమోహన్‌ రెడ్డి కళాశాల వరకు సాగింది. గౌతమ్‌ రెడ్డిని కడసారి చూసేందుకు వచ్చిన అభిమానులు, నేతలు, కుటుంబసభ్యుల అశ్రునయనాల మధ్య 12 గంటలకు ఆయన కుమారుడు కృష్ణార్జున్‌ రెడ్డి.. చితికి నిప్పంటించారు. ప్రభుత్వ లాంఛనాలతో గౌతమ్‌ రెడ్డి అంత్యక్రియలు నిర్వహించారు. గౌతమ్‌ అంత్యక్రియల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి దంపతులు, పలువురు మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్‌ దంపతులు గౌతమ్‌ రెడ్డి కుటుంబసభ్యులను ఓదార్చారు. భారీగా తరలివచ్చిన అభిమానులు, నేతలు గౌతమ్‌ రెడ్డి భౌతికకాయాన్ని చూసి కన్నీంటిపర్యంతమయ్యారు. మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి భౌతికకాయానికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. కుటుంబ సభ్యులు, బంధువులు, అభిమానులు, వైఎస్సార్‌ సీపీ కార్యకార్తలు స్వర్గీయ గౌతమ్‌రెడ్డికి అంతిమ వీడ్కోలు పలికారు. అభిమాన నేతను కడసారి చేసేందుకు జనం భారీ ఎత్తున తరలి వచ్చారు. దారి పొడవునా పూలు చల్లుతూ గౌతమ్‌రెడ్డికి నివాళులు అర్పించారు. సౌమ్యుడు, వివాద రహితుడు, అందరివాడిగా పేరు తెచ్చుకున్న
దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ఇకలేరన్న సంగతి తెలిసి సింహపురి కన్నీరు పెట్టింది. ఆయనను కడసారి చూసేందుకు నెల్లూరు జిల్లా నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా అభిమానులు, నేతలు, అధికారులు పెద్దఎత్తున మేకపాటి నివాసానికి తరలివచ్చారు. ’గౌతమ్‌ అన్న.. అమర్‌రహే..’ అంటూ నినాదాలు చేశారు. విషణ్నవదనాలతో నివాళులర్పించారు. గుండెపోటుతో సోమవారం హైదరాబాద్‌లో కన్నుమూసిన గౌతమ్‌రెడ్డి భౌతికకాయాన్ని అక్కడి నుంచి ప్రత్యేక ఎయిర్‌ అంబులెన్స్‌లో మంగళవారం నెల్లూరుకు తీసుకొచ్చారు. ఉదయం 8.30గంటలకు జూబ్లీహిల్స్‌ రోడ్డు నంబరు 47లోని స్వగృహం నుంచి ఆయన పార్థివదేహాన్ని అంబులెన్స్‌లో బేగంపేట ఎయిర్‌పోర్టుకు తరలించారు. అక్కడి నుంచి ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆర్మీ హెలికాప్టర్‌లో భౌతికకాయాన్ని నెల్లూరు పోలీస్‌ పరేడ్‌ మైదానానికి తరలించారు. బుధవారం ఉదయగరిలో అంత్యక్రియలు ముగిసే వరకు వేలాదిగా అభిమానులు పాల్గొన్నారు.