ముగిసిన న్యాయవాదుల నిరసన
హైదరాబాద్: ఉన్నతవిద్య, పరిశోధన బిల్లు 2011లో న్యాయవిద్యను చేర్చడంపై న్యాయవాదుల రెండ్రోజుల నిరసన గురువారం ముగిసింది. బార్‌కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఏపీ బార్ కౌన్సిల్ ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం రాష్ట్రవ్యాప్తంగా న్యాయవాదుల ఆందోళన ప్రారంభమైన సంగతి విదితమే. గురువారం కూడా వారు కోర్టు విధులను బహిష్కరించారు. ఫలితంగా హైకోర్టుతో పాటు రాష్ట్రవ్యాప్తంగా కోర్టులో కేసుల విచారణ నిలిచిపోయింది. అఖిలభారత న్యాయవాదుల సంఘం, న్యాయవాద పరిషత్, ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ ఈ ఆందోళనలో పాల్గొన్నాయి. ఈ రెండ్రోజుల్లో హైకోర్టులో విచారణ జరగని పిటిషన్లను వరుసగా శుక్రవారం, సోమవారానికి న్యాయమూర్తులు వాయిదా వేశారు. రెండ్రోజుల నిరసన విజయవంతమైందని, రాష్ట్రంలో 50వేలకు పైగా న్యాయవాదులు పాల్గొన్నారని ఏపీ బార్ కౌన్సిల్ ఛైర్మన్ ఎ.నరసింహారెడ్డి తెలిపారు.