ముగిసిన పఠాన్‌ కోట్‌ ఆపరేషన్‌

3

– 6గురు మిలిటెంట్ల మృతి

న్యూఢిల్లీ,జనవరి 4(జనంసాక్షి): రెండు రోజులు ఉత్కంఠ రేపిన పఠాన్‌ కోట్‌ ఆరరేషన్‌ మూడో రోజు ముగిసింది. మొత్తం ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.  మిగిలివున్న ఉగ్రవాదుల కోసం గాలింపు ముమ్మరం చేశారు. మరోవైపు తాజాగా పేలుడు ఒకటి కలకలం సృష్టించింది.  ఎయిర్‌బేస్‌లో మరో ఇద్దరు ఉగ్రవాదులు ఉన్నట్లు ఎన్‌ఎస్‌జీ పేర్కొంది. ఇప్పటివరకు నలుగురు ఉగ్రవాదులను హతమార్చారు. మిగతా ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యే వరకు ఉగ్ర వేట కొనసాగుతుందని అధికారులు తెలిపారు. కూంబింగ్‌ తుది దశకు చేరుకుందని, ఎయిర్‌బేస్‌ వైశాల్యం ఎక్కువగా ఉన్న కారణంగా గాలింపుకు మరింత సమయం పట్టే అవకాశం ఉందని సైనికాధికారులు తెలిపారు. గరుడు, ఎన్‌ఎస్‌జీ, ఆర్మీ, పోలీసులు సంయుక్తంగా ఉగ్రవేటలో పాల్గొన్నారని అధికారులు చెప్పారు. మిగిలిన ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చే వరకు ఆపరేషన్‌ కొనసాగుతుందన్నారు. వైమానిక స్థావరంలోని ఎయిర్‌ఫోర్స్‌ కుటుంబాలు, ఆస్తులు అన్నీ క్షేమంగా ఉన్నట్లు అధికారులు చెప్పారు. సాధారణ పౌరులెవ్వరూ ఎన్‌కౌంటర్‌లో బలికాలేదన్నారు. నేషనల్‌ సెక్యూర్టీ గార్డ్స్‌ ఆధ్వర్యంలో ఉగ్ర వేట జరుగుతోంది. పఠాన్‌కోట్‌ ఇంకా హాట్‌గానే ఉంది. భద్రతాదళాల కూంబింగ్‌ కొనసాగుతుండగానే మళ్లీ కాల్పుల మోతతో ఆ ప్రాంతం దద్ధరిల్లింది. ఇద్దరు ఉగ్రవాదులు ఆ ప్రాంతంలో ఉన్నట్లుగా అధికారులు అనుమానిస్తున్నారు. ఉన్నతాధికారులు సైతం పఠాన్‌కోట్‌లోనే ఉండి పరిస్ధితిని పర్యవేక్షిస్తున్నారు. ఈ ఉగ్రవాదులను సజీవంగా పట్టుకోవాలనే ఉద్ధేశ్యంతో భద్రతా దళాలున్నట్లు తెలుస్తోంది. సాయంత్రం వరకు

ఈ ఆపరేషన్‌ కొనసాగే అవకాశం ఉంది. ఆరుగురు ఉగ్రవాదులు హతమైనా ఇంకా ఇద్దరు ఉగ్రవాదులు ఎయిర్‌ బేస్‌ లో దాక్కుని సమయం చూసి విరుచుకుపడేందుకు వారు యత్నిస్తున్నారు. ఉగ్రవాదులు తప్పించుకునే వీల్లేకుండా అష్టదిగ్బంధం చేశాయి. ఎయిర్‌ బేస్‌ లోకి చొరబడ్డ ఉగ్రవాదుల్లో ఆదివారం సాయంత్రానికే ఆరుగురు హతమయ్యారు. చొరబడిన ఉగ్రవాదులు ఆరుగురేనన్న వాదన కూడా తప్పని తేలిపోయింది. ఉగ్రవాదుల పనిబట్టే క్రమంలో ఏడుగురు భారత సైనికులు కూడా వీరమరణం పొందారు. శనివారం తెల్లవారుజామున పఠాన్‌ కోట్‌ లో మొదలైన కాల్పులు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. విడతలవారీగా కొనసాగుతున్న కాల్పులతో పఠాన్‌ కోట్‌ పరిసర ప్రాంతాలు మారుమోగిపోతున్నాయి.

ఆఫ్ఘాన్‌లో భారత ఎంబసీ వద్ద కాల్పుల కలకలం

ఉత్తర అఫ్ఘానిస్థాన్‌లోని మజార్‌-ఐ-షరీఫ్‌ నగరంలో భారత దౌత్య కార్యాలయం వద్ద సోమవారం ఉదయం మరోసారి కాల్పుల కలకలం చెలరేగింది.ఆదివారం రాత్రి ఉగ్రదాడి జరిగిన విషయం మరువక ముందే ఈ ప్రాంతంలో మరోసారి కాల్పుల శబ్దాలు కలకలం సృష్టించాయి. కాల్పులు కొనసాగుతున్నాయని ఆఫ్ఘాన్‌లో భారత రాయబారి అమర్‌ సిన్హా తెలిపారు. అఫ్ఘనిస్తాన్‌లోని భారత రాయబార కార్యాలయంపై దాడి జరిగింది. మజారీషరీఫ్‌లోని భారత కార్యాలయంపై ఉగ్రవాదుల దాడి జరిగింది. భద్రతాదళాల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందారు. మరో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతాదళాలు పట్టుకున్నాయి. ఎంబసీలోని భారతీయులంతా సురక్షితంగా ఉన్నారు. ఇంకా కాల్పులు కొనసాగుతున్నట్లు సమాచారం.

స్వగ్రామానికి కల్నల్‌ నిరంజన్‌ భౌతిక కాయం

పంజాబ్‌లో పఠాన్‌కోట్‌ ఉగ్రదాడిలో వీరమరణం పొందిన లెఫ్ట్‌నెంట్‌ కల్నల్‌ నిరంజన్‌కుమార్‌(32) భౌతికకాయాన్ని స్వగ్రామానికి తరలించారు. సోమవారం ఆయన మృతదేహాన్ని బెంగళూరుకు, అక్కడి నుంచి కేరళలోని పాలక్కడ్‌కు తరలించారు. నిరంజన్‌ అంత్యక్రియలు ఈరోజు సాయంత్రంస్వస్థలంలోనే నిర్వహించనున్నారు. ్గ/ళిరళలోని పాలక్కడ్‌ జిల్లా ఎలాంబస్సెర్ట్‌ గ్రామానికి చెందిన నిరంజన్‌కుమార్‌ 2004లో సైన్యంలో చేరారు. ఎస్‌ఎస్‌జీలో చేరడానికి ముందు మద్రాస్‌ ఇంజినీరింగ్‌ గ్రూప్‌ ఆఫ్‌ ఆర్మీలో పనిచేశారు. పేలుడు పదార్థాలు నిర్వీర్యం చేయడంలో నిపుణుడైన నిరంజన్‌ బాంబు నిర్వీర్యక విభాగం అధికారిగా ఇటీవలే పదోన్నతి పొందారు. పఠాన్‌కోట్‌ వైమానిక స్థావరంలో ఉగ్రవాదులు విసిరిన గ్రెనేడ్‌ను నిర్వీర్యం చేస్తుండగా అది పేలి దుర్మరణం చెందారు. ఆయనకు భార్య(డాక్టర్‌ రాధిక), 18 నెలల పాప(విస్మే) ఉన్నారు. పంజాబ్‌ పఠాన్‌కోట్‌లో ఉగ్రవాదుల దాడిలో వీరమరణం పొందిన జవాన్ల భౌతికె కాయాలను స్వస్థలాలకు తరలించారు. బాంబును నిర్వీర్యం చేయబోయి మరణించిన లెఫ్టినెంట్‌ కల్నల్‌ నిరంజన్‌కుమార్‌ భౌతికకాయాన్ని బెంగుళూరుకు అక్కడి నుంచి కేరళలోని పాలక్కడ్‌కు తరలించారు.  గ్రౌండ్‌ లో ఉంచిన నిరంజన్‌ భౌతికకాయానికి సీఎం సిద్ధరామయ్య ఇతర ఉన్నతాధికారులు ఘనంగా నివాళులర్పించారు. మరోవైపు ఉగ్రవాదుల దాడిలో అసువులు బాసిన జవాన్‌ గురుసేవక్‌ సింగ్‌ మృతదేహాన్ని స్వగ్రామమైన హర్యానాలోని అంబాలకు తరలించారు. 45 రోజుల క్రితమే గురుసేవక్‌సింగ్‌ వివాహమైంది. ఇంతలోనే ఉగ్రదాడిలో గురుసేవక్‌సింగ్‌ వీరమరణం పొందారు. వీరజవాన్‌ భౌతికకాయాన్ని చూసి అంబాల గ్రామం విలపిస్తోంది. దేశం కోసం తన కుమారుడు చనిపోవడం గర్వంగా ఉందని గద్గద స్వరంతో గురు సేవక్‌ సింగ్‌ తండ్రి పేర్కొన్నారు.