ముగిసిన బల్దియా ప్రచారం
హైదరాబాద్‌జనవరి31(జనంసాక్షి):గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఎన్నికల ప్రచారం ముగిసింది. ఇవాళ సాయంత్రం 5 గంటలతో రాజకీయ పార్టీల ప్రచారానికి తెరపడింది. వచ్చే నెల 2న ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం అవుతుంది. చివరి రోజున అన్ని పార్టీలు జోరుగా ప్రచారం నిర్వహించాయి. 150 డివిజన్లలో రోడ్ షోలు, బైక్ ర్యాలీలు, సభలు, సమావేశాలతో ¬రెత్తించాయి. ఇదిలావుండగా వదినమ్మ భువనేశ్వరి ఓటు కారు గుర్తుకే ముేఖ్యమంత్రి కేసీఆర్ ధీమా వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. టిడిపి అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఓటు… టీఆర్‌ఎస్‌కు వేయడం ఖాయమంటూ… కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఒకవైపు భువనేశ్వరిపై ప్రశంసలు కురిపిస్తూనే… మరోవైపు బాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు కేసీఆర్. టీఆర్‌ఎస్‌తోనే గ్రేటర్ అభివృద్ధి సాధ్యమన్నారు. చంద్రబాబు హైదరాబాద్‌ను… వదల బొమ్మాళి వదలంటున్నారని, అసలాయన్ను ఎవరు పొమ్మన్నారని గులాబీ బాస్ ప్రశ్నించారు. కావాలంటే హైదరాబాద్‌లో హెరిటేజ్ దుకాణాలు పెట్టుకో… లైసెన్స్ కావాలా..? ఏం కావాలో..? చెప్పు… అన్నీ ఇస్తామంటూ గులాబీ దళపతి ఆఫరిచ్చారు. వదిన భువనేశ్వరి వ్యాపారాలు… సక్రమంగానే చూసుకుంటున్నారని, కావాలంటే 15 రోజులకు ఓసారి… హైదరాబాద్‌కు వచ్చి లెక్కలు చూసుకుని పోవాలని కేసీఆర్ బాబుకు సూచించారు. భువనేశ్వరి కూడా ఇక్కడే ఉంటున్నారు. కాబట్టి గ్యారంటీగా తమకే ఓటు వేస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
కాగా ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఖండించారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మరో రాష్ట్ర సీఎం భార్య గురించి అబద్ధాలు చెప్పడం దారుణమన్నారు ఆయన జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారం ముగింపు సందర్భంగా ఆదివారం సాయంత్రం పార్టీ శ్రేణులు నిర్వహించిన బైక్‌ర్యాలీలో లోకేశ్ పాల్గొన్నారు. అనంతరం ఎన్టీఆర్ ఘాట్ వద్ద లోకేష్ విూడియాతో మాట్లాడుతూ టీఆర్‌ఎస్ బహిరంగసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగం ఆద్యాంతం టీడీపీపై విమర్శల దాడిగా కొనసాగిందని, దీన్నిబట్టి తెలంగాణలో టీడీపీ ఎంత బలంగా ఉందో, ఆ పార్టీ అంటే టీఆర్‌ఎస్ కు ఎంత భయమో అర్థమవుతున్నాయన్నారు. ‘కేసీఆర్‌లా అబద్ధాలు చెప్పడం దేశంలో ఎవరికీ సాధ్యం కాదు. నిన్నటి సభలో మరోసారి వేలాది మంది సాక్షిగా అదేపనిచేశారు. మా అమ్మ(భువనేశ్వరి) టీఆర్‌ఎస్‌కు ఓటేస్తుందని చెప్పడం దారుణం. ఆమె గురించి అబద్ధాలు ప్రచారం చేయడం ఘోరం.కేసీఆర్ మాటలకు అమ్మ వెంటనే స్పందించింది. ఆమె ఎవరికి ఓటేస్తారో అందరికీ తెలుసు. ఏది చెప్పినా జనం నమ్ముతారారనేది కేసీఆర్ ధోరణి. ఎవరెలాంటివాళ్లో ప్రజలకు తెలుసు’ అని లోకేశ్ వ్యాఖ్యానించారు.
కేసీఆర్ వ్యాఖ్యలను ఖండించిన చంద్రబాబు సతీమణి
ఇక తెలంగాణ సీఎం వ్యాఖ్యలను చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఖండించారు. తన ఓటు ఎప్పటికీ టీడీపీకేనన్నారు. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి బహిరంగ సభలో అబద్ధమాడారని… అమ్మ చెప్పినట్లు లోకేశ్ ట్వీట్ చేశారు. ఓటర్లను గందరగోళానికి గురిచేసేందుకు, తన పేరును వాడుకోవద్దంటూ టీఆర్‌ఎస్ శ్రేణులకు భువనేశ్వరీ సూచించారు. తాను టీఆర్‌ఎస్‌కు ఓటేస్తున్నానంటూ… కేసీఆర్ చెప్పడం ఆశ్చర్యానికి గురి చేసిందని, అలా చెప్పడం సరికాదన్నారు. ఇప్పటికే బల్దియాలో ఇద్దరు చంద్రులు మాటలతోనే మంటలు పుట్టిస్తున్నారు. గ్రేటర్ ప్రచారంలో ఒక అడుగు ముందుకేసిన కేసీఆర్… ఏకంగా బాబు ఫ్యామిలీలోనే తమకు ఓటంటూ వ్యాఖ్యలు చేశారు. మరి చంద్రన్న ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.