ముగిసిన మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్‌రెడ్డి అంత్యక్రియలు

నివాళి అర్పించిన పలువురు ప్రముఖులు
హైదరాబాద్‌,ఫిబ్రవరి24(జ‌నంసాక్షి):  బీజేపీ సీనియర్‌ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్‌రెడ్డి(73) అంత్యక్రియలు ముగిశాయి. జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలను నిర్వహించారు. బాల్‌రెడ్డి అంత్యక్రియల్లో బీజేపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. నేతలు, అభిమానులు బాల్‌రెడ్డికి చివరిసారిగా కన్నీటి వీడ్కోలు పలికారు. కొంత కాలంగా చిన్నపేగు క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయనకు ఈ నెల 13న కేర్‌ దవాఖానలో శస్త్రచికిత్స నిర్వహించారు. ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో వెంటిలెటర్‌పై ఉంచి చికిత్స అందించారు. పరిస్థితి విషమించి శనివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య యాదమ్మ, కుమారులు గోపాల్‌రెడ్డి, శివపాల్‌రెడ్డి, జైపాల్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి, కూతురు అరుణ ఉన్నారు. ఆయనకు స్పీకర్‌ పోచారం, మంత్రులు నివాళి అర్పించారు. 1945 మార్చి 7న జన్మించిన బద్దం బాల్‌రెడ్డి విద్యార్థి దశలోనే ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరి బాల స్వయంసేవక్‌గా పనిచేశారు. 1962లో జనసంఘ్‌లో చేరి.. అనంతరం బీజేపీలో అగ్రనేతగా ఎదిగారు. 1965-75 మధ్య జనసంఘ్‌ యాకత్‌పుర అసెంబ్లీ ప్రధానకార్యదర్శిగా, 1978లో చాంద్రాయణగుట్ట అసెంబ్లీ కన్వీనర్‌గా పనిచేశారు. 1986-88 మధ్య బీజేపీ ప్రధానకార్యదర్శిగా ఉన్నారు. 1985, 1989, 1994లలో కార్వాన్‌ నుంచి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1991, 1998, 99లలో హైదరాబాద్‌ పార్లమెంట్‌ స్థానంనుంచి పోటీచేసి ఓడిపోయారు. 2009లో చేవెళ్ల నుంచి లోక్‌సభకు, 2014లో కార్వాన్‌ అసెంబ్లీకి పోటీచేసి ఓటమిని చవిచూశారు.