ముగిసిన యడ్లపాటి అంత్యక్రియలు

పాడె మోసి నివాళి అర్పించిన చంద్రబాబు
అమరావతి,మార్చి2(జనం సాక్షి): టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి యడ్లపాటి వెంకటరావు
అంత్యక్రియలు రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా తెనాలిలోని ఆయన నివాసం నుంచి బుర్రిపాలెం రోడ్డులోని శ్మశాన వాటిక వరకు అంతిమ యాత్ర జరిగింది. టీడీపీ అధినేత చంద్రబాబు యడ్లపాటి నివాసానికి వెళ్లి ఆయన భౌతికకాయం వద్ద నివాళి అర్పించారు. ఎమ్మెల్యేలు కరణం బలరాం,అన్నాబత్తుని శివకుమార్‌, మేరుగ నాగార్జున, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మాజీ మంత్రులు ప్రత్తిపాటి, కామినేని శ్రీనివాస్‌, ధూళిపాళ్ల తో పాటు టీడీపీ నాయకులు పలువురు పాల్గొని నివాళులు అర్పించారు. యడ్లపాటి వెంకట్రావు అంతిమయాత్రలో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్నారు. యడ్లపాటి పాడెను చంద్రబాబు పట్టడం గమనార్హం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యడ్లపాటి వెంకట్రావు జీవితం అందరికీ ఆదర్శమన్నారు. యడ్లపాటి మంచి విద్యావంతుడని.. ప్రజల కోసం జీవితాంతం పని చేశారన్నారు. ఒక రాజకీయ నాయకుడు ఎలా ఉండాలో వెంకట్రావుని చూసి నేర్చుకోవాలన్నారు. ఆయన చేసిన పనులు శాశ్వతంగా నిలిచిపోతాయన్నారు. తెలుగుదేశం పార్టీకి ఆయన చేసిన సేవలు ఎనలేనివని చంద్రబాబు కొనియాడారు.