ముగ్గురు చైనా జర్నలిస్టులకు భారత్ దేశబహిష్కారం

న్యూఢిల్లీ: చైనాకు చెందిన అధికార వార్తా సంస్థ ‘జిన్హువా’ తరఫున ఇండియాలో పనిచేస్తున్న ముగ్గురు చైనా సీనియర్ జర్నలిస్టులను దేశం విడిచి వెళ్లాలని ఇండియా ఆదేశించింది. జూలై 31వ తేదీలోగా దేశం విడిచిపెట్టాలని గత వారంలో ఆదేశాలు జారీ అయినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఢిల్లీలోని ‘జిన్హువా’ బ్యూరో చీఫ్ వూ క్వియాంగ్, ముంబైలోని రిపోర్టర్లు లూ తాంగ్, షీ యోగ్యాంగ్‌లు నిషేధిత ప్రాంతాలను సందర్శించి అక్కడి సమాచారాన్ని సేకరించడం వంటి పనులు చేస్తున్నారంటూ ఇంటెలిజెన్స్ సంస్థల సమాచారం మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ తరహాలో చైనా జర్నలిస్టులకు ఇండియా దేశ బహిష్కరణ శిక్ష విధించడం ఇదే తొలిసారి. ఈ ముగ్గురు సీనియర్ జర్నలిస్టుల వీసా గడువు ముగిసిపోయింది. అయితే వూ క్వియాంగ్ ఆరేళ్లకు వీసా పొడిగించుకున్నాడని, అతని ఇద్దరు సహచరులు కూడా వీసా పొడిగించుకుని ఇండియాలో ఉంటున్నారని అధికారులు పేర్కొన్నారు. కాగా, విలేకరుల బహిష్కరణపై చైనా విదేశాంగ శాఖ ఇంకా స్పందించలేదు.