ముగ్గురు పోలీసులకు మరణశిక్ష
లక్నో (ఉత్తరప్రదేశ్) : మూడు దశాబ్దాల నాటి గోండా నకిలీ ఎన్‌కౌంటర్ కేసులో.. ముగ్గురు పోలీసులకు శుక్రవారం ఇక్కడి సీబీఐ ప్రత్యేక కోర్టు మరణశిక్ష విధించింది. మరో ఐదుగురికి జీవిత ఖైదు విధించింది. 31 ఏళ్ల క్రితం గోండా జిల్లాలో జరిగిన నకిలీ ఎన్‌కౌంటర్‌లో ఓ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) సహా 13 మంది మరణించారు. వీరి హత్యకు కుట్ర పన్నినందుకు బాధ్యులను చేస్తూ.. నాటి స్టేషన్ హౌజ్ ఆఫీసర్‌కౌడియా ఆర్.బి.సరోజ్, హెడ్‌కానిస్టేబుల్ రామ్‌నాయక్, కానిస్టేబుల్ రామ్‌కిరణ్‌లకు సీబీఐ కోర్టు జడ్జి రాజేంద్రసింగ్ మరణశిక్ష విధిస్తున్నట్టు ప్రకటించారు.
అలాగే నాటి పీఏసీ కమాండెంట్ రమాకాంత్ దీక్షిత్, సబ్ ఇన్‌స్పెక్టర్లు నసీమ్ అహ్మద్, మంగళసింగ్, పర్వేజ్ హుస్సేన్, రాజేంద్రప్రసాద్ సింగ్‌లకు జీవిత ఖైదు విధిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ కేసులో ఈ 8 మంది పోలీసులను దోషులుగా నిర్ధారిస్తూ మార్చి 29న తీర్పు వెలువరించిన కోర్టు శుక్రవారం శిక్షలను ఖరారు చేసింది. 1982లో గోండా జిల్లాలోని మధోపూర్ గ్రామంలో జరిగిన నకిలీ ఎన్‌కౌంటర్‌లో డీఎస్పీ, సర్కిల్ అధికారి కె.పి.సింగ్ సహా 13 మంది మరణించారు. సింగ్‌ను నేరస్తులు హతమార్చారంటూ పోలీసులు తొలుత వాదించారు. అయితే పోలీసుల వాదనను అనూమానించిన డీఎస్పీ భార్య విభాసింగ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో సర్వోన్నత న్యాయస్థానం సీబీఐ విచారణకు ఆదేశించింది. రంగంలోకి దిగిన సీబీఐ…దీనిని నకిలీ ఎన్‌కౌంటర్‌గా నిర్ధారించింది.