ముదిరాజ్‌ లను బీసీ డీ నుంచి బీసీ ఏలో చేర్చుతాం

1

డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి హావిూ

తెలంగాణ ఉద్యమంలో ముదిరాజ్‌ ల పాత్ర కీలకం

ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌

ఓరుగల్లు సాక్షిగా ముదిరాజ్‌ సింహగర్జన

వేల సంఖ్యలో కదంతొక్కిన ముదిరాజ్‌ కులస్థులు

వరంగల్‌ సెప్టెంబర్‌ 14(జనంసాక్షి):

పోరుగల్లు ఓరుగల్లులో ముదిరాజ్‌ లు కదంతొక్కారు. వరంగల్‌ వేదికగా తమ సంఘటిత శక్తిని చాటారు. ముదిరాజ్‌ సింహగర్జన పేరిట వరంగల్‌ లో నిర్వహించిన భారీ బహిరంగసభకు వేల సంఖ్యలో హాజరయ్యారు. ఈ సభకు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరితోపాటు.. ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మాట్లాడుతూ… అన్నిరకాలుగా వెనకబడిన ముదిరాజు కులస్థులను బిసి డి నుంచి బిసి ఏ లో చేర్చుతామని సింహగర్జన సభ సాక్షిగా హావిూఇచ్చారు. ముదిరాజ్‌ కులస్థులు ఎన్నో దశాబ్దాల పాటు తీవ్ర అన్యాయానికి గురైయ్యారని.. ముఖ్యమంత్రి కేసిఆర్‌ తో చర్చించి వారు ఎదుర్కొనే సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని ప్రకటించారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో తెలంగాణవ్యాప్తంగా కదంతొక్కిన ముదిరాజులకు రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాలుగా అండగా ఉంటుందని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌ హామిచ్చారు. తెలంగాణలో 13శాతం జనాభా కలిగిన ముదిరాజులు అన్ని రంగాల్లో వెనకబడిన విషయాన్ని ఈ సందర్భంగా  డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి గుర్తుచేశారు. వరంగల్‌ పట్టణంలో జరిగిన ఈ భారీ బహిరంగ సభ ప్రాంగణానికి తెలంగాణ ఉద్యమంలో అమరుడైన పోలీసు కిష్టయ్య ముదిరాజ్‌ నామకరణం చేశారు. ముదిరాజులను బిసి-డి నుంచి బిసి-ఏలోకి మార్చాలన్న డిమాండ్‌ నూటికి నూరుశాతం న్యాయమైనదని బహిరంగసభకు హాజరైన ముఖ్యనేతలు, ప్రజాప్రతినిధులంతా అంగీకరించారు. తెలంగాణ ప్రభుత్వం ముదిరాజుల కమ్యూనిటి భవనాలకోసం 10లక్షల చొప్పున ఇచ్చిందని,  అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా  250 భవనాలు నిర్మించనున్నామని చెప్పారు.. ముదిరాజ్‌ ల ప్రధాన వృత్తుల్లో ఒకటైన చేపల ఉత్పత్తి కోసం ఎన్ని నిధులు ఖర్చు చేయడానికైనా ప్రభుత్వం వెనుకాడదన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి ముదిరాజ్‌ ల సమస్యలు తెలుసని.. వాటిని తప్పకుండా పరిష్కరిస్తుందని చెప్పారు. ముఖ్యమంత్రితో మాట్లాడి మత్య్సకారులకు రుణాలు ఇప్పించే బాధ్యత తీసుకుంటానని చెప్పారు. ముదిరాజు కులంలో పుట్టిన తనను ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఆర్థిక మంత్రిని చేశాడంటేనే పేద ప్రజలకు డబ్బులకు కొదవలేదు అని చెప్పడానికి ఇది నిదర్శనమని ఈ సందర్భంగా ఈటెల రాజేందర్‌ పేర్కొన్నారు. సభ ప్రారంభానికి ముందు కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. వరంగల్‌, కరీంనగర్‌, మెదక్‌ తోపాటు అనేక జిల్లాల నుంచి వేల సంఖ్యలో ముదిరాజ్‌ కులస్థులు ఈ బహిరంగసభకు హాజరయ్యారు. తెలంగాణ ముదిరాజ్‌ మహాసభ అధ్యక్షుడు డాక్టర్‌ బండ ప్రకాశ్‌ ముదిరాజ్‌ ఆధ్వర్యంలో జరిగిన ముదిరాజ్‌ ల సింహగర్జన బహిరంగ సభకు డిప్యూటి సిఎం కడియంతోపాటు మంత్రి ఈటెల రాజేందర్‌ తోపాటు…  ఎంపిలు సీతారాం నాయక్‌, సుధారాణి, ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌ భాస్కర్‌, చల్లా ధర్మారెడ్డి, ఆరూరి రమేష్‌, ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌ హాజరయ్యారు.

ముదిరాజుల్లో కొత్త ఉత్సాహం…

తెలంగాణలో అత్యధిక జనాభా కలిగిన ముదిరాజులు ఈ సభ ద్వారా తమ సత్తా చాటారు. ఒక్క పిలుపునిస్తే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ముదిరాజు కులస్తులంతా కదిలివస్తారని నిరూపించారు. మహిళలు సైతం పెద్దసంఖ్యలో ఈ సభకు హాజరుకావడం… అందరిలో ఉత్సాహాన్ని నింపింది. రాష్ట్ర రాజకీయ యవనికపై ఇక ముదిరాజులను ఏ రాజకీయ పార్టీ విస్మరించలేదని… సంఘటిత శక్తిగా ఎదుగుతున్న ముదిరాజ్‌ లను విస్మరించే రాజకీయ పార్టీలకు పుట్టగతులుండవని ఈ సందర్భంగా సభకు హాజరైన ముదిరాజ్‌ ప్రతినిధులు వ్యాఖ్యానించారు. రానున్నరోజుల్లో తెలంగాణవ్యాప్తంగా మరిన్ని బహిరంగ సభలు నిర్వహించి ముదిరాజ్‌ ల సత్తాచాటుతామని… రాష్ట్రంలో రాజకీయంగా తమకు సముచితమైన ప్రాధాన్యం లభించేవరకూ తాము విశ్రమించమని సింహగర్జన సాక్షిగా ప్రతిజ్ఞ చేశారు.