ముద్రగడ దీక్ష విరమణ

1

– చర్చలు సఫలం

కాకినాడ,ఫిబ్రవరి 8(జనంసాక్షి): కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం దీక్షను విరమించారు. కాపుల ప్రయోజనాలు కోరుతూ నాలుగురోజుల క్రితం ప్రారంభించిన దీక్షను చాలించారు.  ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రతినిధుల బృందం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. దాదాపు గంటన్నర సేపు ఏపీ ప్రభుత్వ ప్రతినిధులు మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు, కళా వెంకట్రావు, బొడ్డు భాస్కర రామారావు తదితరులు ముద్రగడతో చర్చించారు. చర్చల తర్వాత వైద్య పరీక్షలు చేయించుకునేందుకు ముద్రగడ అంగీకరించారు. దీంతో వైద్యులు ఆయన నివాసానికి వెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించారు.ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలం కావడంతో నాలుగు రోజులుగా చేస్తున్న దీక్షను ముద్రగడ విరమించారు. మంత్రి అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావు ఆయనకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. ముద్రగడ పద్మనాభంతో జరిపిన చర్చలు సఫలం అయ్యాయని  మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. కాపుల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సానుకూలంగా ఉన్నారని స్పష్టం చేశారు. గతంలో ఎన్నో ప్రభుత్వాలు కాపులను ఓటు బ్యాంకుగా మాత్రమే చూశాయి తప్ప వారి అభ్యున్నతికి చేసిందేవిూ లేదన్నారు. ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలన్న కృతనిశ్చయంతోనే తాము ముద్రగడతో చర్చలు జరిపినట్లు చెప్పారు. అదే విషయాన్ని ముద్రగడతో చర్చించామని అన్నారు. కాపులకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం కాపు కమిషన్‌ ఏర్పాటు చేసినట్లు అచ్చెన్నాయుడు చెప్పారు. కాపు సామాజిక వర్గంలో పేదలు, ఆర్థికంగా వెనకబడిన వారికి సహాయం చేసేందుకు ఈ కమిషన్‌కు నిధులు విడుదల చేస్తున్నట్లు చెప్పారు. తునిలో జరిగిన అల్లర్లు అందరికీ బాధ కలిగించాయన్నారు. కాపు వర్గీయుల ముసుగులో కొందరు కావాలనే ఈ దుర్మార్గానికి పాల్పడినట్లుగా ప్రభుత్వం భావిస్తోందన్నారు. ఈ ఘటనలో కేసులన్నింటినీ క్షుణ్ణంగా అధ్యయనం చేసి బాధ్యులపై మాత్రమే చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ఘటనకు సంబంధం లేనివారిని ప్రభుత్వం ఏవిూ చేయదన్నారు./ూష్ట్ర ప్రజలందరూ సంయమనంగా ఉండాలని మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. కాపులకు రిజర్వేషన్లు ఇస్తే బలహీనవర్గాలకు అన్యాయం జరుగుతుందని కొందరు కావాలనే రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. బలహీనవర్గాలకు అన్యాయం జరగకుండా కాపులకు రిజర్వేషన్లు కల్పించేలా ప్రభుత్వ ప్రయత్నం చేస్తోందన్నారు. కాపులకు ఇచ్చిన ప్రతి హావిూకి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

కాపుల అభివృద్ధి కోసమే ఉద్యమబాట: ముద్రగడ

కాపు సామాజిక వర్గం అభివృద్ధి కోసమే తాను ఉద్యమబాట పట్టినట్లు ముద్రగడ పద్మనాభం తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో కాపులకు చంద్రబాబునాయుడు ఇచ్చిన హావిూలను నెరవేర్చాలని మాత్రమే తాము అడుగుతున్నట్లు చెప్పారు. ప్రభుత్వం తమకిచ్చిన హావిూలను నిలబెట్టుకుంటుందని భావిస్తున్నట్లు ముద్రగడ స్పష్టం చేశారు. చర్చల ద్వారా తమకు నమ్మకం కలిగిందన్నారు. కాపు కమిషన్‌కు ప్రస్తుతం రూ.500 కోట్లు ఇస్తామని ప్రభుత్వం చెప్పిందని… వచ్చే బడ్జెట్‌లో ఏటా రూ.వెయ్యి కోట్లు ఇస్తామని హావిూ ఇచ్చినట్లు తెలిపారు. తుని ఘటనలో అమాయకులపై కేసులు పెట్టినట్లు తన దృష్టికి వచ్చిందని… దానిపైనా పునరాలోచించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. కాపు జాతికి తన జీవితాన్ని అంకితం చేశానని… వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరించాలని కోరారు. కాపులు మళ్లీ రోడ్డెక్కే పరిస్థితి రానివ్వకుండా చేసే బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబుదేనని ముద్రగడ స్పష్టం చేశారు. కాపుల కోసమే దీక్ష చేశానని ముద్రగడ పద్మనాభం తెలిపారు. ప్రభుత్వంతో చర్చలు సఫలం కావడంతో ముద్రగడ దీక్షను విరమించారు. అనంతరం విూడియాతో మాట్లాడుతూ తన డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందన్నారు. తమ జాతి ఆకలి కేకలను పట్టించుకోవాలనే దీక్ష చేసినట్లు చెప్పారు. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలన్నది తన ఉద్దేశం కాదని వివరించారు. ఇచ్చిన హావిూల కోసమే పట్టుబట్టామని, అందుకే దీక్షకు దిగామని అన్నారు.  కాపు జాతి ఆకలి కేకలు చూడలేకే రోడ్డెక్కినట్లు స్పష్టం చేశారు. కాపు కులంలో పేదలు, ఆర్థికంగా వెనకబడి ఉన్నవారికి రిజర్వేషన్లు కల్పించాలన్నదే తమ ప్రధాన డిమాండని చెప్పారు. బీసీలకు ఎలాంటి నష్టం జరగకుండా కాపులకు రిజర్వేషన్లు కల్పించాలన్నారు. కాపులకు రిజర్వేషన్ల కల్పించడం వల్ల బీసీలకు అన్యాయం జరిగితే తాము ఊరుకోమన్నారు. తమ డిమాండ్ల సాధన కోసం ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని విమర్శిస్తే క్షమించాలని కోరారు. తమ విమర్శలు ఆవేదనతో చేసినవే తప్ప… ద్వేషంతో చేసినవి కాదన్నారు. తమ పోరాటానికి మద్దతు తెలిపిన వివిధ రాజకీయ పార్టీల నేతలు, పలు కుల సంఘాల నేతలకు ముద్రగడ ధన్యవాదాలు తెలిపారు.  పేదలకే రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతున్నామని ముద్రగడ పద్మనాభం అన్నారు. తనకు మద్దతుగా దీక్షలు చేపట్టినవారంతా విరమించాలని ముద్రగడ కోరారు. చంద్రబాబును నిందించే ఉద్దేశం తనకు లేదని, ఆవేశంతో మాట్లాడి ఉంటే క్షమించాలని అన్నారు. జీవో 30 వల్ల ఉపయోగం ఉండదని చెప్పారని, ప్రభుత్వం మాటను తాను నమ్ముతున్నానని ముద్రగడ పద్మనాభం పేర్కొన్నారు.

ముద్రగడ తనను నమ్మి దీక్ష విరమించారు:చంద్రబాబు

కాపులకు ఇచ్చిన హావిూ మేరకు న్యాయం చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. వెనుకబడిన వర్గాలకు టీడీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని సీఎం చంద్రబాబు హావిూ ఇచ్చారు. సోమవారం ఆయన విూడియాతో మాట్లాడుతూ కాపులకు న్యాయం చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హావిూ ఇచ్చామని తెలిపారు. కాపులకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. కాపులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటామని స్పష్టం చేశారు. ఆర్థిక అసమానతలు తగ్గించే నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. ప్రపంచంలో ఉన్నది రెండు కులాలే… డబ్బు ఉన్నవాళ్లు… లేనివారని వేదాంతాన్ని వల్లెవేశారు. కులాలు, మతాలు అనేది మనం గీసుకున్న గీతలేనని బాబు అన్నారు. ముద్రగడ పద్మనాభం తమను నమ్మి దీక్ష విరమించారని, ముద్రగడ పద్మనాభంను అభినందిస్తున్నానని చంద్రబాబు చెప్పారు. ఎవరు కూడాకోరుకుని కులంలో పుట్టరని ఆయన అన్నారు. మతం కూడా ఒక నమ్మకమని ఆయన అన్నారు. తూర్పు గోదావరి లో పుట్టినవారికి మొదట నుంచి నీళ్ల తో ఉంటారని , రాయలసీమలో ఉండకపోవచ్చని అన్నారు. తాను ఏమి చెప్పానో అదే ప్రకారం చేస్తామని కాపులకు సంబందించి చంద్రబాబు అన్నారు. ఎవరు చెప్పకపోయినా తాము చెప్పింది చేస్తామని అన్నారు. తనస్థాయి నాయకుడు ఎవరూ పాదయాత్ర చేయలేదని అన్నారు. ఒక సామాజిక కార్యకర్త గా తిరిగానని ,అది తన జీవితాన్ని ట్రాన్స్‌ పామ్‌ చేశానని అన్నారు. రెండుసార్లు నిరవధిక దీక్ష చేశానని,ఒకసారి రైతుల కోసం, మరో సారి డిల్లీలో వీళ్లు చేసిన అరాచకపు పనిపై చేశానని అన్నారు. ఇవన్ని తాను గుర్తుంచుకుంటానని, కాపులలో పేదలకోసం కృషి చేస్తానని అన్నారు. వచ్చే ఏడాది కాపులకు వెయ్యి కోట్లు ఇస్తామని చంద్రబాబు అన్నారు. దీనిని రాజకీయ లబ్ది కోసం వాడుకోరాదని అన్నారు. సున్నితమైన సమస్యను జటిలం చేయరాదని కోరానని అన్నారు. చెప్పింది సాద్యం చేసే యత్నం జరుగుతున్నప్పుడు అంతా సహకరించాలని అన్నారు. కులాలు, మతాలపై తాను ప్రజలలో చర్చ జరగాలని అన్నారు. ప్రతి ఒక్కరు శాంతి సౌభాగ్యాల కోసం కృషి చేయాలని అన్నారు. చిరంజీవి కూడా ఎందుకు అక్కడ కు వెళ్లాలని అన్నారు. ఎందుకు పార్టీ పెట్టారు? ఎందుకు కాంగ్రెస్‌ లో విలీనం చేశారు?అని ఆయన ప్రశ్నించారు.బిసిలకు అన్యాయం జరగకుండానే కాపులకు న్యాయం చేస్తామని ఆయన అన్నారు. తుని రైలు ఘటనలో బయటవారు ఉన్నారని, దీనిపై విచారణ జరుగుతోందని ముఖ్యమంత్రి అన్నారు. తుని విధ్వంసానికి రాయలసీమ నుంచి మనుషులను పంపిచారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. నిజమైన దోషులను శిక్షిస్తామని అన్నారు. విద్వంసం వాస్తవమని, రైలు తగలబడిందని, అలాగే వాహనాలు కాలిపోయాయని అన్నారు. అమాయకులను కేసులలో పెట్టరని, విచారణ జరుగుతోందని అన్నారు.